Bharat Biotech Terminates Covaxin Deal With Brazil's Precisa
Bharat Biotech Covaxin deal Brazil’s Precisa : కోవాగ్జిన్ (Covaxin) వ్యాక్సిన్ల సరఫరా కోసం హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ కంపెనీ బ్రెజిల్ (Precisa Medicamentos)తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ ఒప్పందంలో అవినీతికి ఆరోపణలు, అవకతవకల మధ్య కోవాక్సిన్ విక్రయించడానికి బ్రెజిల్ కంపెనీతో చేసుకున్న అవగాహన ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం వెనుక గల కారణాన్ని వెల్లడించలేదని రాయిటర్స్ నివేదించింది.
దేశంలో కోవాక్సిన్ వినియోగానికి అవసరమైన అన్ని ఆమోదాలు పొందటానికి బ్రెజిల్ హెల్త్‌కేర్ రెగ్యులేటర్ అన్విసాతో కలిసి పనిచేస్తామని భారత్ బయోటెక్ ప్రకటనలో పేర్కొంది. గతబ్రెజిల్ వ్యాక్సినేషన్ కోసం భారత్ బయోటెక్ సంస్థతో ఫిబ్రవరిలోనే 324 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో నియమ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలు వినిపించాయి. దాంతో దేశీయంగా రాజకీయ దుమారాన్ని రేపింది. దేశంలో నిరసనకారులు అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై అవినీతి ఆరోపణలు చేశారు. దాంతో బ్రెజిల్ ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ దర్యాప్తు చేపట్టారు. బ్రెజిల్ ప్రభుత్వం కూడా జూన్ 30న కోవాక్సిన్ 20 మిలియన్ మోతాదులను సేకరించే ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ప్రెసిసాను మధ్యవర్తిగా ఉపయోగించి కోవిడ్ -19 వ్యాక్సిన్ 20 మిలియన్ మోతాదులను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో అక్రమాలకు పాల్పడినట్లు బ్రెజిల్‌లో ఆరోపణలు ఉన్నాయి. అధ్యక్షుడు బొల్సనారో తన సన్నిహితులకు లబ్ధిచేకూర్చేలా లావాదేవీలు చేశారని ఆరోపణలున్నాయి. రెండు కోట్ల టీకాలకు ఆర్డర్ ఇస్తే డెలివరీ కాకపోవడం కూడా బొల్సనారోను ఇరకాటంలో పడేసింది. వాక్సిన్ ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు లేవంటోంది బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ. వరుస ఆరోపణలు.. దర్యాప్తులో ఆరోగ్య శాఖ మరింత లోతైన విశ్లేషణ కోసమే డీల్‌ను నిలిపివేసినట్లు చెబుతోంది. డీల్‌లో ఎలాంటి కుంభకోణం జరగలేదని, తన పాత్రేమీ లేదని అధ్యక్షుడు బొల్సనారో ముందునుంచి వాదిస్తూ వస్తున్నారు.