అయోధ్య రామమందిర ఆలయ నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ కార్యక్రమం జరుగనుంది. ఆలయ అధికారులు, హిందుమత పెద్దలు సుదీర్ఘ చర్చల అనంతరం (జూలై 29, 2020)న భూమి పూజ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఆగస్ట్ 5న దివ్యమైన ముహూర్తం ఉందని అదే రోజున శంకుస్థాపన చేసి తీరాల్సిందేనని సంకల్పించారు.
ప్రధానమంత్రి మోడీ చేతుల ఈ కీలక ఘట్టాన్ని జరిపించాలని రామాలయ పెద్దలు నిర్ణయించారు. మోడీకి త్వరలోనే ఆహ్వానాన్ని సైతం పంపనున్నారు. కాగా ఎన్నో ఏళ్లుగా కోర్టుల్లో నలుగుతున్న అయోధ్య రామమందిర భూ వివాదానికి గత ఏడాది సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో ముగింపు పలికిన విషయం తెలిసిందే. వీలైనంత త్వరలోనే ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాలని ప్రయత్నించినా.. కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయి.
అనంతరం కొంత వెసులుబాటు కల్పించడం నెల రోజులుగా భూమిని చదును చేసే పనులు చేపడుతున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే మరో నెల రోజుల్లోనే కీలక ఘట్టం ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంది.