Bihar AIMIM MLA says ‘Bharat’ ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు AIMIM నాయకులు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే,బీహార్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్తారుల్ ఇమాన్ సోమవారం ప్రమాణ స్వీకారం సందర్భంగా ‘హిందుస్తాన్’ అననంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాన్ని రేపారు.
రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ.. దానిలో భారత్ అనే ఉంది కదా.. హిందుస్తాన్ అని ప్రమాణం చేయడం సరైందేనా అని తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఇమాన్ అన్నారు. రాజ్యంగా ప్రకారం ప్రమాణ స్వీకారం చేసే ప్రతిసారి భారత్ అనే ఉపయోగిస్తాం. ఈ క్రమంలో నేను హిందుస్తాన్ అని ఉపయోగించడం సరైందేనా.. లేక భారత్ అనే ఉపయోగించాలా. ఎందుకంటే మేం ప్రజాప్రతినిధులం. రాజ్యాంగం మాకు అన్నింటి కంటే ఎక్కువ అని ఇమాన్ అన్నారు.
రిపోర్టర్ల ప్రశ్నలకు ఇమాన్ సమాధానమిస్తూ.. హిందుస్తాన్ అనే పదం పట్ల నేను ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. చేయను కూడా. రాజ్యాంగ ప్రవేశికను ఏ భాషలో చదివినా అందులో ఉండేది భారత్ అనే. దీని ప్రకారం రాజ్యాంగం పేరిట మన ప్రమాణం చేస్తున్నందున దానిలో ఉన్న దాన్ని ఉపయోగించడమే సరైన పని అని అన్నారు.
అయితే,ఇమాన్ వ్యాఖ్యల పట్ల బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నాయకుడు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. హిందుస్తాన్ అని పలకాలంటే ఇబ్బంది పడేవారు పాకిస్తాన్ వెళ్లవచ్చు అని పార్టీ నాయకుడు ప్రమోద్ కుమార్ పేర్కొన్నారు.