Bihar Teacher : ఇంత నమ్మక ద్రోహమా.. కూలి పని చేసి భార్యను చదివిస్తే.. ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక
Bihar Teacher : భార్య కల సాకారం కోసం అతడు కూలి పని చేశాడు.. ఉన్న కాస్త పొలం కూడా అమ్మాడు. భర్త కష్టంతో చదువుకుని ఉద్యోగం తెచ్చుకున్న ఆ మహిళ చివరకు తీరని ద్రోహం చేసింది. ఆ వివరాలు..
bihar bpsc teacher gunjan kumar abandoning family after getting job
Bihar Teacher : పెళ్లి తర్వాత చదువుకుంటాను, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతాను, ఉద్యోగం చేస్తాను అంటే వద్దనే భర్తలు నేటి కాలంలో కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. తన భార్యకు చదువుకోవాలని కోరిక ఉందని తెలిసి అతడు ఆమెను ఆ దిశగా ప్రోత్సహించాడు. పైగా భార్యను చదివించేందుకు ఆ భర్త కూలి పనులకు వెళ్లి.. ఉన్న పొలం సైతం అమ్మాడు. మరి అంతలా కష్టపడి చదివించి.. తనను ప్రయోజకురాలిని చేసిన భర్త పట్ల ఎంత ప్రేమ, అభిమానం, విశ్వాసం ఉండాలి? కానీ సదరు భార్య మాత్రం.. బాగా చదువుకుని ఉద్యోగం వచ్చాక.. కట్టుకున్న భర్తను, కన్న కొడుకును గాలికి వదిలేసి.. మరో వ్యక్తితో వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న భర్త.. దీని గురించి భార్యను ప్రశ్నించడానికి వెళ్లగా అక్కడ.. చూడకూడని రీతిలో భార్య కనిపించేసరికి అతడి గుండె ముక్కలైంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అలాగే దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
బీహార్‌లోని వైశాలి జిల్లా హాజీపూర్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. భర్త అమన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అతడికి 2013లో గుంజన్ కుమారి అనే మహిళతో వివాహం అయ్యింది. అప్పటికే ఆమె ఇంటర్ పూర్తి చేసింది. అయితే పెళ్లి తర్వాత టీచర్ కావడమే తన లక్ష్యమని గుంజన్ తన భర్తకు చెప్పింది. భార్యను చదివించేందుకు తన ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా సరే అమన్ మాత్రం వెనకడుగు వేయలేదు. తాను కూలి పనులు చేస్తూ గుంజన్‌ను చదివించాడు. డిగ్రీ, బీఈడీ పూర్తి చేయడంతో పాటు బీపీఎస్సీ (BPSC) టీచర్ నియామక పరీక్ష సన్నద్ధత కోసం పొలం అమ్మి డబ్బులు సమకూర్చాడు.
సర్కార్ కొలువు వచ్చాక..
ఇదిలా ఉంటే గుంజన్ కుమారి BPSC TRE-02 నియామక ప్రక్రియలో టీచర్ కొలువు సాధించింది. శిక్షణ తర్వాత.. ఆమెకు బిదుపూర్ బ్లాక్‌లోని ఒక సర్కార్ బడిలో పోస్టింగ్ ఇచ్చారు. అయితే ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత గుంజన్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. మరో వ్యక్తితో సన్నిహితంగా మెలగడం ప్రారంభించింది. ఈ క్రమంలో 2025 జనవరిలో గుంజన్ తమ 10 ఏళ్ల కుమారుడు ఆరుష్ ఆర్యను తన భర్త అమన్ వద్దకు పంపించి, తాను తన తోటి టీచర్లు అందరితో కలిసి డార్జిలింగ్ వెళ్తున్నానని భర్తకు చెప్పింది.
ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గుంజన్ చెప్పినట్లు.. ఇతర టీచర్లు ఎవరూ కూడా డార్జిలింగ్ వెళ్లలేదని అమన్‌కు తెలిసింది. దీంతో గుంజన్‌పై అతడికి అనుమానం మొదలయ్యింది. దీని గురించి ఆరా తీయగా.. టీచర్ ట్రైనింగ్ సమయంలో గుంజన్‌కు ప్రేమ్ ప్రకాశ్ జైస్వాల్ అనే మరో టీచర్‌తో సంబంధం ఏర్పడిందని.. అందుకే కుటుంబానికి దూరంగా ఉంటుందని అమన్‌కు తెలిసింది.
చూడకూడని స్థితిలో భార్య
ఈ క్రమంలో వారం రోజుల క్రితం, అంటే మే 23న అమన్.. హాజీపూర్‌లోని లిచ్ఛవి నగర్ ప్రాంతంలో గుంజన్ నివాసం ఉంటున్న అద్దె ఇంటి వద్దకు వెళ్లాడు. అతడు వెళ్లేసరికే.. గుంజన్, ప్రేమ్ ప్రకాశ్‌తో కలిసి ఉండడాన్ని చూసి అమన్ షాకయ్యాడు. ఏం చేయాలో పాలుపోక వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అమన్ రాక గురించి తెలుసుకున్న గుంజన్.. బయటకు వచ్చి అతడితో గొడవపడింది. ఈ క్రమంలో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
🚨Betrayal of Sacrifices: Wife Leaves Husband After BPSC Success
The shocking case of Aman Kumar from Hajipur, Bihar, exposes a bitter reality of changing attitudes after financial independence.
Aman worked day and night, selling ancestral land to fund the education of his… pic.twitter.com/jryTz01uer
— Ramesh Tiwari (@rameshofficial0) May 29, 2026
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక, ఈ వివాదంలో వారి కుమారుడు కూడా కేంద్ర బిందువుగా మారాడు. గుంజన్.. మరో వ్యక్తిని “అంకుల్” అని పిలవాలని తనని ఒత్తిడి చేసిందని, తనకు తల్లితో కలిసి ఉండాలని లేదని ఆ బాలుడు చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి.
