Bihar Widow : బీహార్ లోని పాట్నాలో దారుణం జరిగింది. బహదూర్ చక్ ఏరియాకు చెందిన ధర్మషీలా దేవి(23) అనే మహిళ కు ఇప్పటికి 3 సార్లు పెళ్లి అయ్యింది. నాలుగో సారి పెళ్లి చేసుకోవాలి అనుకుంది. అందుకు అడ్డుగా ఉన్న దివ్యాంగుడైన కన్న కొడుకును నీట ముంచి హత్య చేసింది.
ధర్మషీలా దేవి నలంద జిల్లా భదౌల్ కి చెందిన అరుణ్ చౌదరితో మొదటి వివాహం అయ్యింది. వారికి సాజన్ కుమార్ అనే కొడుకు పుట్టాడు. సాజన్(4) మూగవాడు, కళ్లు కూడా సరిగా కనపడవు. కొడుకు పుట్టిన ఏడాదికి భర్త నుంచి ధర్మషీలాదేవి విడిపోయింది. ఆమె మళ్లీ రెండో పెళ్ళి చేసుకుంది. రెండో భర్త కొన్నాళ్లకే కన్నుమూశాడు.
అనంతరం ముస్తఫాపూర్ కు చెందిన మహేష్ చౌదరిని మూడో వివాహం చేసుకుంది. అతను కూడా రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ధర్మషీలా దేవి నాలుగో పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ ఆమెకు తన కుమారుడు అడ్డంకి గా ఉన్నాడని భావించి అతడ్ని నీట ముంచి చంపింది.
షాజహాన్ పూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని హస్సన్ పూర్ ఖందా ప్రాంతంలోని చెరువు వద్దకు తీసుకువెళ్లి నీళ్లల్లో ముంచి కొడికుని చంపేసింది. మరుసటి రోజు ఉదయం బాలుడి మృతదేహాన్ని చెరువులో గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
గ్రామస్తులు ఇచ్చిన ఆధారాలతో పోలీసులు ధర్మషీలా దేవిని గుర్తించి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.పోలీసుల విచారణలో అన్ని విషయాలు వెల్లడించింది. నాలుగో పెళ్ళి కోసమే కొడుకుని తానే హత్యచేసినట్లు ఒప్పుకుంది. మొదటి భర్త అరుణ్ చౌదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేపట్టారు.