Prashant Kishor: ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద బలం ఈ మూడు విషయాలే! -ప్రశాంత్ కిషోర్

వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందా? అనే విషయంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Prashant Kishor

Prashant Kishor: వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందా? అనే విషయంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. హిందూత్వ, జాతీయవాదం, ప్రజా సంక్షేమ విధానాలపై బీజేపీ ప్రజల్లో బలమైన ముద్ర వేసిందని, వీటిలో కనీసం రెండు అంశాల్లోనైనా ప్రతిపక్షాలు బీజేపీని ప్రజలు నమ్మకుండా చేసినప్పుడే బీజేపీ ఓడిపోయే అవకాశం ఉందన్నారు ప్రశాంత్ కిషోర్.

ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ ఒక్కటే బీజేపీని ఓడించలేదని, బీజేపీని ఓడించగల ఫ్రంట్‌ ఒకటి ఏర్పడినప్పుడే బీజేపీ ఓటమి సాధ్యమవుతుందని చెప్పారు. అటువంటి ఫ్రంట్ నిర్మించడంలో ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలని తాను అనుకుంటున్నట్లు చెప్పారు ప్రశాంత్ కిషోర్.

వచ్చే నెలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సెమీ ఫైనల్స్‌గా భావించవచ్చా? అంటే ముమ్మాటికీ కాదని అన్నారు. బీజేపీని ఓడించాలంటే ఏ పార్టీకైనా కనీసం 5నుంచి 10ఏళ్ల వ్యూహం కావాలని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. ఐదు నెలల్లో ఏదీ జరగదని అన్నారు.

ఇక పశ్చిమబెంగాల్ ఎన్నికల తర్వాత ఐదు నెలల పాటు చర్చలు జరిగినప్పటికీ, కాంగ్రెస్‌తో కలవడానికి తాను చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ కలిసి పనిచేయడం సహజంగా కనిపిస్తుందని,  కాంగ్రెస్ తనను నమ్మినప్పుడే ఒక అడుగు ముందుకు వేయగలను అన్నారు.

కానీ కాంగ్రెస్‌ తనను నమ్మలేదని, కాంగ్రెస్‌ను ఒక్క విషయంలో మాత్రం అభినందించాలన్నారు ప్రశాంత్ కిషోర్. కాంగ్రెస్ పార్టీ తన భావజాలంను మాత్రం వదులుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడదని, కానీ.. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్‌లో భారీ మార్పులు అవసరమన్నారు.

కేంద్రంలో తృణమూల్ కాంగ్రెస్‌కు సపోర్ట్‌గా తాను నడుస్తున్నట్లుగా (పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌ను కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా మార్చడానికి చేసిన ప్రయత్నం) అందరూ భావించారని, బీజేపీపై ప్రతీకారం తీర్చుకునేందుకే ప్రశాంత్ కిషోర్ ప్రయత్నించినట్లుగా అందరూ లెక్కలేశారని, కానీ, అటువంటి ప్రయత్నమేమీ జరగలేదని అన్నారు.

నేను చాలా చిన్నవాడిని, అంత పెద్ద పార్టీపై ప్రతీకారం తీర్చుకోవాలని ఎలా ఆలోచిస్తాను. అందుకోసం బలమైన ప్రతిపక్షం కావాలని మాత్రమే చెప్పినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ బలంగా ఉంటే మాత్రం ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుందని అన్నారు ప్రశాంత్ కిషోర్.