Karnataka Elections 2023
Karnataka Elections 2023 : కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చిన బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిమరోసారి అధికారం చేపట్టాలని చూస్తోంది. కానీ ఇప్పటికే బీజేపీకి షాక్ ఇచ్చి హస్తంపార్టీలో చేరుతున్నారు పెద్ద పెద్ద నేతలంతా. బీజేపీ నుంచి టికెట్ దక్కకపోవటంతో అసంతృప్తితో బీజేపీని వీడుతున్నారు. అయినా తగ్గేలేదన్నట్లుగా బీజేపీ వ్యవహారం ఉంది. ఇప్పటికే పలువురు అభ్యర్థుల మూడో జాబితాను కూడా విడుదల చేసి మాంచి దూకుడుమీదున్న కాషాయదళం తాజాగా క్యాంపెయినర్ల లిస్టును కూడా విడుదల చేసింది. కర్ణాటకలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవటానికి బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగి ప్రచారంలో పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాజకీయ చాణక్యుడుగా పేరొందిన అమిత్ షాతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరి, లు ఉన్నారు.
ఈ మేరకు 40 మంది క్యాంపెయినర్లతో పార్టీ జాబితాను ప్రకటించింది.అయితే ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జేపీ నడ్డా, మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్,ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, స్మృతీ ఇరానీ వంటి యోధానుయోధులతో పాటు ఇతర సీనియర్ నేతలు కూడా పాల్గొననున్నారు. అలాగే కర్ణాటక నుంచి యడియూరప్ప, నళిన్ కుమార్ కటీల్, బసవరాజబొమ్మై తో పాటు మొత్తం 40మంది క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ విడుదల చేసింది.
Bharatiya Janata Party releases list of star campaigners for Karnataka Assembly elections
PM Modi, JP Nadda, Rajnath Singh and Amit Shah are among those who will be campaigning in the state pic.twitter.com/8DW3qereia
— ANI (@ANI) April 19, 2023
మే 10న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ
కాగా..కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకుగాను అధికార పార్టీ అయిన బీజేపీ మరోసారి అధికారం కోసం పక్కాగా ప్లాన్స్ లు వేస్తోంది. ఇప్పటికే రెండు దఫాలుగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ తొలి జాబితాలో 189 మందితో, రెండో జాబితాలో 23 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ రెండు జాబితాల్లో టికెట్లు దక్కని పలువురు నేతలు పార్టీకి రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
మూడో అభ్యర్ధుల జాబితాను కూడా విడుదల చేసిన బీజేపీ
తాజాగా బీజేపీ మూడో జాబితాను విడుదల చేసింది. 10 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంట్లో మూడు స్థానాల్లో పార్టీ నేతల కుటుంబ సభ్యులకే టికెట్లు దక్కాయి. తాజాగా మూడో జాబితా రిలీజ్‌తో 222 స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. శివమొగ్గ, మాన్వి నియోజకవర్గాల్లో మాత్రం ఇంకా అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించలేదు. ఇదిలాఉంటే, తొలి రెండు జాబితాల్లో జగదీశ్ శెట్టర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుబ్లీ – ధార్వాడ్ సెంట్రల్ అసెంబ్లీ సెగ్మెంట్ పేరు ప్రస్తావనకు రాలేదు. అంతేకాక, జగదీశ్ శెట్టర్ కు టికెట్ ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం నిరాకరించడంతో ఆయన సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. తాజాగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుబ్లీ -ధార్వాడ్ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి మహేష్ టెంగింకై ను పార్టీ బరిలోకి దింపింది.
మూడో జాబితాలో ప్రకటించిన పది నియోజకవర్గాల అభ్యర్థుల్లో ముగ్గురు పార్టీ నేతల కుటుంబ సభ్యులే ఉండటం గమనించాల్సిన విషయం. మహాదేవపురం నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే అరవింద్ లింబావళి భార్య మంజుల అరవింద్ బరిలోకి దిగనున్నారు. హెబ్బాళ్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కట్టా సుబ్రహ్మణ్య నాయుడు తనయుడు కట్టా జగదీష్ ను పార్టీ బరిలోకి దింపింది. కొప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొప్పల్ లోక్‌సభ సభ్యుడు కరాడి సంగన్న టికెట్ ఆశించాడు. రెండు జాబితాల్లో టికెట్ జాప్యంకారణంగా అతను పార్లమెంట్ సభ్యత్వంతో పాటు, పార్టీ నుంచి వైదొలగాలని అనుకున్నారు. అయితే, అదే కొప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కారడి సంగన్న కోడలు మంజుల అమరేష్ పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించింది.