Tn
TN BJP తమిళనాడులోని నాలుగు జిల్లాల బీజేపీ అధ్యక్షులకు జాక్ పాట్ తగిలింది. కోయంబత్తూర్,కన్యాకుమారి,ఈరోడ్,తిరునెల్వేళ్లి జిల్లాల పార్టీ అధ్యక్షులకు ఆదివారం లగ్జరీ ఇన్నోవా కార్లను కానుకగా ఇచ్చింది బీజేపీ. రాష్ట్రంలో ఏప్రిల్-6న జరిగిన ఎన్నికల్లో సుమారు 20ఏళ్ల తరువాత ఈ నాలుగు జిల్లాల్లోని.. ప్రతి జిల్లాలో ఒక అసెంబ్లీ సీటు చొప్పున కమలనాథులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన నేపథ్యంలో వారి గెలుపునకు చేసిన కృషికి గాను ఈ నాలుగు జిల్లాల బీజేపీ అధ్యక్షులకు ఇన్నోవా క్రిస్టా SUV కార్లను గిఫ్ట్ గా ఇచ్చింది అధిష్ఠానం.
ఇన్నోవా కార్లు దక్కించుకున్న వారిలో కోయంబత్తూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నందకుమార్, ఈరోడ్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సుబ్రమణియన్, కన్యాకుమారి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ధర్మరాజన్లు,తిరునెల్వేళ్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు మహారాజన్ ఉన్నారు. వీరికి కేంద్రమంత్రి ఎల్ మురగన్ కార్లను అందజేశారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, పార్టీ సీనియర్ నేత సీపీ రాధాక్రిష్ణన్ లు హాజరయ్యారు. ఎల్.మురగన్ గతంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు.. అభ్యర్థులు గెలిస్తే ఇన్నోవా కార్లు ఇస్తామని హామీనిచ్చారు. ఈ మేరకు వారిని గెలిపించిన జిల్లా అధ్యక్షులకు కార్లను గిఫ్ట్ గా ఇచ్చారు.