మహా పవర్ గేమ్ : 170 మంది ఎమ్మెల్యేల బలం ఉంది – శరద్ పవార్

  • Publish Date - November 23, 2019 / 07:35 AM IST

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బీజేపికి సపోర్టు చేసిన అజిత్ పవార్‌పై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ఆయన నిర్ణయం వ్యక్తిగతంగా వెల్లడించారు. పవార్ పార్టీ నిబంధనలు ఉల్లంఘించారు, ఎన్సీపీ ఎప్పుడూ బీజేపీతో చేతులు కలపదని స్పష్టం చేశారు. అజిత్ పవార్‌కు కేవలం 10 మందిలోపు ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని, పవార్‌తో ఉన్న ఎమ్మెల్యేలు కూడా తమతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. 2019, నవంబర్ 23వ తేదీ శనివారం మధ్యాహ్నం శివసేన, ఎన్సీపీ పార్టీలు సంయుక్తంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కానీ దీనికి కాంగ్రెస్ దూరంగా ఉండడం గమనార్హం. 

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ పోలేదని, తమకు ఉండాల్సిన సంఖ్యాబలం ఉందన్నారు శరద్ పవార్. 170 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, అంతేగాకుండా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల సపోర్టు ఉందని ప్రకటించారు. 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందని,  ఉదయం 6 గంటలకు ప్రమాణ స్వీకారం గురించి చెప్పారన్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అనుకున్నా..2019, నవంబర్ 22వ తేదీ శుక్రవారం రాత్రి వేగంగా పరిణామాలు మారిపోయాయి.

ఎన్సీపీ పార్టీకి చెందిన అజిత్ పవార్ బీజేపీలో వాలిపోయారు. 30 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి సపోర్టు చేస్తున్నారని చెప్పడం..సీఎంగా ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్‌లు ప్రమాణ స్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శివసేన, ఎన్సీపీ పార్టీలు షాక్ తిన్నాయి. మహారాష్ట్రలో బల నిరూపణకు నవంబర్ 30వరకు గడువు ఇచ్చారు గవర్నర్. అప్పటి వరకు ఇంకా ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాలి.
Read More : రెండుగా చీలిపోయిన ఎన్సీపీ..30 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు!