లాక్‌డౌన్ వేళ బీజేపీ ఎమ్మెల్యే బర్త్‌డే..వందలమందికి బిర్యానీతో విందు

  • Publish Date - April 11, 2020 / 04:02 AM IST

సామాజిక దూరమే శ్రీరామరక్ష. కరోనా మహమ్మారి ప్రారదోలాలంటే..సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ కొంత మంది ప్రజాప్రతినిధులు లెక్క చేయడం లేదు. ఇతరులకు మార్గదర్శకంగా ఉండాల్సిన నేతలు లాక్ డౌన్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఇటీవలే పలు ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బీజేపీ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. 

కర్నాటకలోని తుమకూర్ జిల్లాలోని బీజేపీ ఎమ్మెల్యే మసాలే జయరామ్ పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారు. సొంతూరు ఇదగూరు ఇందుకు వేదిక అయ్యింది. వందల మంది అనుచరులు, ఆయన అభిమానులు హాజరయ్యారు. ఇదే వివాదాస్పదమైంది. ఎవరూ సామాజిక దూరం పాటించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బర్త్ డే సందర్భంగా బిర్యానీ కూడా వడ్డించారు. గుంపులు గుంపులుగా బిర్యానీని తిన్నారు. 

ఇది ముగియగానే..దీనిపై ఎమ్మెల్మే జయరామ్ మాట్లాడారు. సామాజిక దూరం పాటిస్తే..కరోనా రాదని, వేడి నీళ్లతో చేతులను తరచూ కడగాలని సూచించడం విశేషం. కరోనా విలయతాండవం చేస్తున్న క్రమంలో ఎమ్మెల్యే ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని సూచిస్తున్నారు కొంతమంది. 

ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా కర్ణాటకలో తుమ్కూరులో ఒకటితో సహా ఆరు మరణాలు సంభవించాయి. 200 కి పైగా కరోనా వైరస్ కేసులు ఉన్నాయి. లాక్ డౌన్ మరో రెండు వారాల పాటు పొడిగించాలని నిపుణుల బృందం సిఫార్సు చేస్తోంది. (లాక్‌డౌన్‌‌లో జైలు నుంచి బయటకు.. దొంగతనానికి వచ్చి మహిళపై లైంగికదాడి)