* హింసాత్మక ఘటనలు జరిగిన దర్యాగంజ్ ప్రాంతం రామ్ లీలా మైదాన్‌కు కిలోమీటర్ల దూరంలో ఉంది.
* సరిహద్దు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు.
* అన్ని మార్గాల్లో సీసీ టీవీ కెమెరాలు, స్నిప్పర్లు ఏర్పాటు.
పౌరసత్వ సవరణ చట్టం ప్రకంపనాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుంది. ఈ క్రమంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాం లీలా మైదాన్‌లో మెగా ర్యాలీ నిర్వహిస్తుండడంతో అందరి చూపు అటే నెలకొంది. డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం దర్యాగంజ్‌లో జరిగిన హింసాకాండకు కేవలం కిలోమీటర్ దూరంలో రాంలీలా మైదాన్ ఉంది. దీంతో ర్యాలీకి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.
2019, డిసెంబర్ 22వ తేదీ ఆదివారం ఉదయం 11.30గంటలకు మెగా ర్యాలీలో మోడీ ఇచ్చే స్పీచ్‌పై అందరి ఉత్కంఠ నెలకొంది. ప్రసంగంలో పౌరసత్వ సవరణ చట్టం గురించి మాట్లాడుతారా అనే చర్చ జరుగుతోంది. ర్యాలీకి భారీగా జనసమీకరణ చేస్తున్నారు కాషాయ నేతలు. ర్యాలీకి సుమారు రెండు లక్షల మంది హాజరవుతారని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. మైదాన్‌లో ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. మోడీ, షా కటౌట్లు ఏర్పాటు చేశారు.
వేయి 731 అనధికారిక కాలనీల్లోని 40 లక్షల మందికి నివాసితులకు యాజమాన్య హక్కులు కల్పించినందుకు ధన్యవాద్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందని బీజేపీ సీనియర్ లీడర్ విజయ్ గోయల్ వెల్లడించారు. ఇందులో 11 లక్షల మందితో కూడిన సంతకాల పేపర్లను మోడీకి అందచేయడం జరుగుతుందన్నారు.
ర్యాలీకి అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించే వారిని ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. వేదికకు వెళ్లే అన్ని మార్గాల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. భవనాలపై స్నిప్పర్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని పోలీసులు వెల్లడించారు.
Read More : మోదీ సమీక్ష : సంక్రాంతి తర్వాత కేంద్ర కేబినెట్ విస్తరణ!