Maharashtra Elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ మ్యానిఫెస్టోలో కీలక హామీలు ఇవే..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ‘సంకల్ప్ పత్ర’ పేరుతో

Maharashtra BJP Manifesto

Maharashtra Assembly Elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ‘సంకల్ప్ పత్ర’ పేరుతో ఆదివారం ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. రైతులకు రుణమాఫీ నుంచి నిరుద్యోగ యువతకు 25లక్షల ఉద్యోగాల కల్పన.. ఇలా పలు కీలక హామీలను మ్యానిఫెస్టోలో పొందుపర్చారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. రైతులు, మహిళల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను రూపొందించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్ని ఎత్తులు వేసినప్పటికీ దేశంలో మత ఆధారిత రిజర్వేషన్లను బీజేపీ అనుమతించదని అమిత్ షా స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని వికసిత్ మహారాష్ట్రగా మార్చేందుకు రోడ్ మ్యాప్ ను రూపొందించామని తెలిపారు.

Also Read: Maharashtra Elections 2024: మహారాష్ట్రలో ఐదు గ్యారెంటీలను ప్రకటించిన మహా వికాస్ అఘాడి కూటమి.. అవేమిటంటే?

బీజేపీ మ్యానిఫెస్టోలో ముఖ్యాంశాలు..
◊  రైతులకు వ్యవసాయ రుణాలు మాఫీ చేసి, వారిపై రుణ భారాన్ని తగ్గించడానికి చర్యలు.
◊  పారిశ్రామిక అభివృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం నుంచి రూ. 25లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు.
◊  నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం 25 లక్షల ఉద్యోగాలు.
◊  రాష్ట్రంలో మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించే లక్ష్యంతో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల డిమాండ్, సరఫరాను అంచనా వేయడానికి సమగ్ర నైపుణ్య గణన.
◊  ప్రస్తుతం 11 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తున్న లఖపతి దీదీ పథకాన్ని 50లక్షల మంది మహిళలకు వర్తించేలా చర్యలు.
◊  వృద్ధులకు నెలవారీ అందించే పెన్షన్ రూ. 1500 నుంచి రూ, 2,100కు పెంపు.
◊  నిత్యావసర వస్తువుల ధరలను స్థిరంగా ఉంచేందుకు చర్యలు.
◊  రైతులు ఎరువులపై చెల్లించిన జీఎస్టీ తిరిగి చెల్లించి, వారి ఆర్థిక భారాన్ని తగ్గించేలా చర్యలు.
◊  రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆకాంక్ష కేంద్రం ఏర్పాటు. వీటి ద్వారా రాష్ట్రంలో 10లక్షల మంది కొత్త పారిశ్రామిక వేత్తలను తయారు చేసేలా చర్యలు.
◊  అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రోబోటిక్స్, ఏఐ నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాలను అందించడానికి ‘మరాఠీ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ స్కీమ్.
◊  అంగన్ వాడీ, ఆశా వర్కర్లకు నెలకు రూ. 15వేలు వేతనం, బీమా సౌకర్యం.