షా జోస్యం : పశ్చిమ బెంగాల్‌ BJPదే

  • Publish Date - May 15, 2019 / 06:31 AM IST

పశ్చిమబెంగాల్‌లో మమత శకం ముగిసిందని.. బీజేపీ విజయం ఖాయం అంటున్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. కుట్రలు, కుతంత్రాలు చేసినా బెంగాల్ ప్రజలు తమ వైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారాయన. నాపై మమత సర్కార్ FIR నమోదు చేసిందని.. అయినా భయపడను అంటున్నారు. ఎన్ని అక్రమాలు చేసినా.. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం సాధించడం పక్కా అంటున్నారాయన. అమిత్ షా నిర్వహించిన ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మే 15వ తేదీ బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

దేశవ్యాప్తంగా 370 సీట్లలో బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. మోడీ ఆధ్వర్యంలో NDA ప్రభుత్వం ఏర్పాటు కావటం ఖాయం అని జోస్యం చెప్పారు షా. మమత పార్టీ కేవలం 42 సీట్లలో మాత్రమే పోటీ పడుతోందని.. నిన్నటి ఘటనతో ఆమె విశ్వరూపం బయటపడిందన్నారు. టీఎంసీ కార్యకర్తలు బీజేపీ పోస్టర్లను తొలగించారని చెప్పిన షా.. తన రోడ్ షోలో TMC కార్యకర్తలు మూడు సార్లు దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆందోళన కారులను పోలీసులు అడ్డుకోలేదన్నారు.

ఈశ్వరచంద్ర విగ్రహాన్ని టీఎంసీ గూండాలే ధ్వంసం చేశారని ఆరోపించారాయన. పంచాయతీ ఎన్నికల్లో కొంతమంది నేతలను హత్య చేశారని..అందులో బీజేపీ నేతలున్నారని.. ఇలాంటి ఘటనలు ఏ రాష్ట్రంలో జరగలేదన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఈవీఎంలను ఎత్తుకెళ్లారని.. రిగ్గింగ్ జరుగుతున్నా ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర పోషించిందంటూ చెప్పుకొచ్చారు. బెంగాల్‌లో నిష్పక్షపాతికంగా ఎన్నికలు జరగాల్సింది పోయి.. ఈసీ చూస్తూ ఉండటం ఏంటని ప్రశ్నించారు అమిత్ షా. మమత చేసిన ప్రచారంపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. హింసతో అధికారంలోకి రావాలని కలలు కంటున్నారని..బీజేపీ హింసకు వ్యతిరేకమని షా చెప్పారు. 

పశ్చిమబెంగాల్‌లో అల్లర్లపై సీఈసీ దృష్టి పెట్టింది. ఎన్నికల పరిశీలకులతో ఆరా తీసింది. కోల్ కతాలో అమిత్ షా నిర్వహించిన ర్యాలీలో రాళ్లు, కర్రలతో టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారంటూ బీజేపీ ఆరోపిస్తోంది. ఈసీకి బీజేపీ కంప్లయింట్ చేసింది.