టాప్ హీరోయిన్ అలియా భట్‌కే టోపీ పెట్టిన అసిస్టెంట్.. ఏకంగా..

బాలీవుడ్ నటి అలియా భట్ మాజీ పీఏని పోలీసులు అరెస్టు చేశారు.

Bollywood Heroin Alia Bhatt

Alia Bhatt: బాలీవుడ్ నటి అలియా భట్ మాజీ పీఏని పోలీసులు అరెస్టు చేశారు. 2021 నుంచి 2024 వరకు అలియా పీఏగా వేదిక ప్రకాశ్ శెట్టి పనిచేసింది. నటికి సంబంధించిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు, పేమెంట్స్, షెడ్యూల్ ప్లానింగ్ లను చూసుకునేది. అయితే, ఆమె దాదాపు రూ.77లక్షలు మోసానికి పాల్పడినట్లు తేలింది. అలియా నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో పనిచేస్తున్నప్పుడు వేదిక ఈ అక్రమాలకు పాల్పడింది.

వేదికా ప్రకాశ్ శెట్టికి 32ఏళ్లు. అలియా భట్ తల్లి, నటి దర్శకురాలు సోనీ రజ్ధాన్ జనవరి 23న జుహు పోలీసులకు వేదికపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై నేరపూరిత, నమ్మక ద్రోహం, మోసం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదైన తరువాత వేదిక పరారీలో ఉంది. దీంతో పోలీసులు ఆమె కోసం వెతుకులాట మొదలు పెట్టారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రాజస్థాన్, కర్ణాటక, పూణెల్లో తిరిగిన ఆమె.. చివరకు బెంగళూరులో పోలీసులకు చిక్కింది. దీంతో ఆమెను అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

2021లో అలియా భట్ పీఏగా వేదిక ఉద్యోగంలో చేరింది. మరుసటి ఏడాది నుంచే.. అంటే 2022 నుంచే నకిలీ బిల్లులు సృష్టించి అలియా సంతకాన్ని మార్ఫింగ్ చేసి ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అలియా పేరుతో ఆమె దాదాపు రూ.77లక్షలు మోసానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. అలియా సంతకం చేసిన తరువాత వేదిక ఈ మొత్తాన్ని తన స్నేహితుల అకౌంట్ కు పంపి.. తరువాత వినియోగించేదని పోలీసులు తెలిపారు.