Bomb Explodes In Cow’s Mouth వేటగాళ్ల ఘాతుకానికి ఒడిశాలో మరో గోమాత తీవ్ర గాయాలపాలైంది. అడవి పందులను వేటాడేందుకు పొలాల్లో ఏర్పాటు చేసిన నాటు బాంబును ఆవు కొరికింది. దీంతో ఆవు నోరు పేలి చెల్లాచెదురైంది. బుధవారం(జనవరి-6,2021) గంజాం జిల్లా కెండుపాట్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఆవుకి ట్రీట్మెంట్ జరుగుతోంది.
మరోవైపు, ఢిల్లీలో ఓ వ్యక్తి ఆవుదూడను తీవ్రంగా గాయపర్చాడు. మండవాలి ఏరియాకు చెందిన కమల్‌సింగ్ చేతిలో డాక్యుమెంట్లతో రోడ్డుపై వెళ్తుండగా తల్లి వెంట ఉన్న ఓ ఆవు లేగ అతని చేతికి తగిలింది. చేతిలోని డాక్యుమెంట్లు రోడ్డుపై పడిపోయాయి. దాంతో కమల్ సింగ్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రోడ్డుపైన పడ్డ డాక్యుమెంట్లను తీసుకోకుండానే ఆవులేగను తీవ్రంగా కొట్టాడు. కాలితో ఇష్టమొచ్చినట్లు తన్నాడు. అనంతరం డాక్యుమెంట్లను తీసుకుని మళ్లీ దాడి చేశాడు. రాళ్లతో కొట్టాడు.
కమల్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆవులేగ లేవలేని స్థితిలో కింద పడిపోయింది. అయితే కమల్ సింగ్ అదేమీ పట్టించుకోకుండా తన దారిన తాను వెళ్లిపోయాడు. అయితే అతను దూడపై దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వాటిని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఆ వీడియో ఆధారంగా కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. గాయపడ్డ అవుదూడను చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు.