Bombay High Court imposes Rs.25,000 fine on State for registering FIR against 9 year old boy
Bombay High Court : తొమ్మిదేళ్ల బాలుడిపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కేసును కోర్టుకు సమర్పించారు. ఎఫ్ఐఆర్ ను పరిశీలించిన ధర్మాసనం బాలుడిపై కేసు నమోదు చేసిన పోలీసులను తీవ్రంగా మందలించింది. తొమ్మిదేళ్ల పిల్లాడిపై కేసు నమోదు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు రూ.25,000 జరిమానా విధించింది. బాలుడిపై నమోదు చేసిన కేసును కొట్టివేసింది.
ఓ తొమ్మిదేళ్ల బాలుడు సైకిల్‌పై వెళుతుండగా అనుకోకుండా ఓ మహిళను ఢీకొట్టాడు. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సదరు బాధిత మహిళ పోలీసులకు బాలుడిపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 338 కింద కేసు నమోదు చేశారు. బాంబే హైకోర్టుకు సబ్మిట్ చేశారు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తులు జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ ఎస్ఎమ్ మోదక్ ఈ కేసును కొట్టివేశారు.
అయితే భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 83 కింద రక్షణ ఉన్నప్పటికీ బాలుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం వల్ల ఆ బాలుడికి తగిలిన గాయాలను పరిగణలోకి తీసుకోలేదని..7 నుంచి 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల విషయంలో ఇలాంటివి నేరాలుగా పరిగణించకూడదని సెక్షన్ 83 నిర్దేశిస్తుందని పేర్కొన్నారు. పోలీసుల తీరు బాలుడి మనోభావాలను గాయపరిచిందని అన్నారు. ఐపీసీలోని సెక్షన్ 83 ఉన్నప్పటికీ, పిటిషనర్ కుమారుడైన 9 ఏళ్ల బాలుడిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం సరైన చర్య కాదని అన్నారు.
పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిసిస్తూ.. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని, బాలుడిది ఏమి తెలియని వయసు అని, మైనర్ పై నమోదు చేసిన ఎఫ్ ఐఆర్ కొట్టివేయాలని కోరారు. ప్రమాద సమయంలో బాలుడికి కూడా గాయాలయ్యాయని, మీడియాలో వచ్చిన వీడియో ఈ విషయాన్ని స్పష్టం చేస్తుందని న్యాయవాది న్యాయమూర్తుల ముందు చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తులు బాలుడిపై నమోదు చేసిన ఎఫ్ ఐఆర్ కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. న్యాయమూర్తుల తీర్పునకు ప్రభుత్వం తరపున న్యాయవాది, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం చెప్పలేదు. ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందని స్పష్టంగా గమనించిన కోర్టు..బాలుడి వయస్సును పరిగణలోకి తీసుకోకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం పట్ల విచారం వ్యక్తం చేసింది.
ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సబ్-ఇన్‌స్పెక్టర్ చట్టంలో ఉన్న నిబంధనలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే అలా జరిగిందని.. మైనర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ఉద్దేశం తమకు లేదని పోలీసులు పేర్కొన్నారు. అయితే వాద, ప్రతివాదాలు విన్న న్యాయస్థానం బాలుడిపై ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసి, పరిహారంగా పిటిషనర్‌కు రూ.25,000 చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధ్యులైన పోలీసు అధికారుల నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేయవచ్చని కోర్టు తీర్పునిచ్చింది.