కరోనా సూచనను పట్టించుకోని కర్ణాటక సీఎం….భారీ వివాహ వేడుకకు హాజరు

కరోనా వైరస్ దృష్ట్యా దేశంలోని పలు రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మాల్స్,థిముటర్లు,బార్లు,రెస్టారెంట్లు అన్నింటినీ చాలా రాష్ట్రాలు ఇప్పటికే మూసివేశాయి. ఇందులో కర్ణాటక ప్రభుత్వం కూడా ఉంది. కర్ణాటకలో ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడవద్దని,ప్రజలు వీలైనంతవరకు ఏవైనా శుభకార్యాలు,పెళ్లిల్లు వంటి వాయిదా వేసుకుంటే మంచిదని కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే సూచించింది.

అయితే తన సొంత ప్రభుత్వమే ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడటంపై బ్యాన్ విధించిన సమయంలో కర్ణాటక సీఎం యడియూరప్ప మాత్రం ఆదివారం(మార్చి-15,2020)బెళగావిలో అంగరంగవైభవంగా జరిగిన బీజేపీ ఎమ్మెల్సీ మహంతేష్ కవాటగిమత్ కూతురి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో యడియూర్పప్ప పాల్గొన్నారు. యడియూరప్ప మాత్రమే కాకుండా ఈ పెళ్లి కార్యక్రమంలో..అసెంబ్లీలో గవర్నమెంట్ చీఫ్ విప్ కూడా పాల్గొన్నారు.

వేడుకలో పాల్గొన్న పెద్ద సంఖ్యలో ప్రజల గురించి అడిగినప్పుడు… జనసమూహాన్ని నివారించవచ్చు అని సీఎం యడియూరప్ప అన్నారు. ఎక్కువ మంది ప్రజలు గుమిగూడవద్దని చూడమని ఆదేశాలు ఇవ్వబడ్డాయి. వివాహాలలో ఎక్కువ మంది ప్రజలు గుమిగూడకూడదు అని ముఖ్యమంత్రి చెప్పారు.

భారత్ లో తొలి కరోనా మరణం కర్ణాటకలో నమోదైన విషయం తెలిసిందే. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన ఓ వృద్ధుడు ఇటీవల దుబాయ్ నుంచి భారత్ కు తిరిగివచ్చాడు. దుబాయ్ నుంచి తిరిగివచ్చిన కొన్ని రోజులకే అతడు అనారోగ్యంతో హాస్పిటల్ చేరాడు. గత వారం ట్రీట్మెంట్ పొందుతూ ఆయన కన్నుమూశాడు. అయితే పరీక్షల్లో అతడికి కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. ఆయన మరణం తర్వాత కర్ణాటకలో అన్ని స్కూల్స్,కాలేజీలు,మాల్స్,రెస్టారెంట్లు,థియేటర్లు మూసివేసిన విషయం తెలిసిందే.