ఎన్నికల బరిలో ఓ ట్రాన్స్‌జెండర్ అదృష్టం పరీక్షించుకోనున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో BSP తరపున ఆమె ఎన్నికల్లో నిలుస్తున్నారు. ఒడిషా రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కొరై అసెంబ్లీ స్థానానికి ట్రాన్స్ జెండర్ కాజల్ నాయక్‌ని బరిలో దింపుతున్నట్లు BSP మార్చి 16వ తేదీ శనివారం ప్రకటించింది. టికెట్ కేటాయించడం పట్ల కాజల్ సంతోషం వ్యక్తం చేసింది.
ఈ సందర్బంగా కాజల్ మీడియాతో మాట్లాడుతూ…తనకు టికెట్ కేటాయించాలని…ఎన్నో పార్టీలను అడిగినా..తనను ప్రోత్సాహించలేదన్నారు. చివరకు BSP టికెట్ కేటాయించిందని, ట్రాన్స్ జెండర్‌ను ప్రోత్సాహించినందుకు ఆనందంగా ఉందన్నారు. తమ కమ్యూనిటీలో ఎన్నో సమస్యలున్నాయని, ఈ సమస్యలను తాను లేవనెత్తి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశ్యంతో ట్రాన్స్ జెండర్‌కి టికెట్ కేటాయించినట్లు, వారి కమ్యూనిటీ గురించి ఎవరూ మాటాడరని బీఎస్పీ నేత కృష్ణ చందర్ వ్యాఖ్యానించారు.
కాజల్ సోషల్ వర్కర్. ఈమె ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్‌కి ప్రెసిడెంట్. వారిలో ఉన్న సమస్యలను పరిష్కరించుకొనేందుకు ఈమె పలు పోరాటాలు నిర్వహించారు. ఒడిషా రాష్ట్రంలో 147 అసెంబ్లీ సీట్లున్నాయి. నాలుగు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మే 23వ తేదీన కౌంటింగ్ జరుగనుంది. జూన్ 11వ తేదీతో అసెంబ్లీ గడువు ముగియనుంది.