CAA Protest : మంగళూరులో పోలీసుల కాల్పులు..ఇద్దరి మృతి

  • Publish Date - December 20, 2019 / 01:10 AM IST

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగుళూరు, లక్నోలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు చనిపోయారు. అటు దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరు, కేరళ, చెన్నై, లక్నో సహా పలు  నగరాల్లో ఆందోళన కారులు బీభత్సం సృష్టించారు. పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఆందోళనలు రోజు రోజుకీ ఎక్కువ అవుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది.

హోంశాఖ ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ నిర్వహించింది. కర్ణాటకలోని మంగళూరులో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తుండగా.. పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఇక, లక్నోలో కూడా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరోవైపు  ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనల్లో వందలాది మంది ప్రజలు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. 

పశ్చిమబెంగాల్, కేరళ, కర్నాటకలోనూ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు సాగాయి. కోల్‌కతాలోని రామ్‌లీలా మైదానంలో ఆందోళనకారులు సిఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. కేరళలోని  త్రివేండ్రంలో డివైఎం ఆధ్వర్యంలోని ప్రదర్శనపై పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించారు. కర్నాటకలో పరిస్థితిని గమనించిన సిఎం యడియూరప్ప 72 గంటలపాటు 144 సెక్షన్ విధించారు.. బెంగళూరులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనకి దిగిన రామచంద్రగుహ, సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఢిల్లీ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంది. ఇంటర్నెట్  సేవలపై ఆంక్షలు విధించింది…ఢిల్లీలో రద్దీ ఏరియాలైన ఐటీఓ, వల్లాడ్ సిటీ ఏరియా, మండీ హౌస్, సీలంపూర్,  జఫ్రాబాద్, షహీన్ బాగ్, జామియా నగర్, ముస్తఫాబాద్ ప్రాంతాలలో మొబైల్ సర్వీసులు దాదాపు ఆరు గంటలపాటు నిలిచిపోయాయి. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితిపై కేంద్రహోంశాఖ అత్యున్నతస్థాయి సమావేశం  ఏర్పాటు చేసింది..తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది.
Read More : మీ ఆస్తులు వేలం వేస్తాం…ఆందోళనకారులకు యూపీ సీఎం హెచ్చరిక

ట్రెండింగ్ వార్తలు