మోడీ, అమిత్ షాతో త్వరలో ముస్లిం నేతలు, మతగురువుల భేటీ

  • Publish Date - December 27, 2019 / 01:12 PM IST

పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌరుల పట్టిక (NRC)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తునా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. అసోంలో NRC, CAAను నిరసిస్తూ ఆందోళనలకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఏఏ, ఎన్ఆర్‌సీ అమలు విషయంలో విపక్షాలు సైతం మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ రెండింటి అమలుతో దేశంలో ముస్లింలు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో కొంతమంది ముస్లిం మతాధికారులు, నేతలు, మేధావులు, చట్టసభ సభ్యులంతా కలిసి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను త్వరలో కలువనున్నట్టు సమాచారం. ఆల్ ఇమామ్ ఆర్గానైజేషన్ చీఫ్ డాక్టర్ ఇమామ్ ఉమర్ అహ్మద్ లియాసీ మీడియాతో మాట్లాడుతూ.. ‘ముస్లింల మత గురువులు, విద్యావేత్తలు, మేధావులు, చట్టసభ సభ్యులు, మదరసా సంరక్షకుల ప్రతినిధి బృందం త్వరలో అమిత్ షా, మోడీని కలవనుంది’ అని ఆయన చెప్పారు.

CAA, NRC అమలుపై ఆందోళనలతో నెలకొన్న పరిస్థితులపై మోడీ, షాలతో ప్రతినిధి బృందం అంచనా వేయనుంది. దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టం, జాతీయ పౌర పట్టికకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు, వివిధ సంస్థలు, విద్యాసంస్థలన్నీ ఆందోనళ బాట పట్టాయి. గతవారమే పాత ఢిల్లీలోని జామా మసీదు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

హింసాత్మక ఘటనలకు పాల్పడొద్దని, శాంతియుతంగా చర్చించుకుందామని చీఫ్ ఇమామ్ ఆందోళనకారులను కోరారు. ‘దేశ పౌరులందరికి నాదొక విన్నపం.. శాంతియుతంగా కొనసాగాలి. నిరసన వ్యక్తం చేయడమనేది మన ప్రజాస్వామ్య హక్కు. మనం తప్పనిసరిగా పోరాడాలి. కానీ, శాంతియుతంగా చేయాల్సి ఉంది’ అని ఆయన పిలుపునిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు