ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF )పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నుంచి ఆగస్టు వరకు మరో మూడు నెలల పాటు చందాను చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. వంద మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థలు, రూ.15వేల కంటే తక్కువ వేతనం పొందున్న కార్మికులు, ఉద్యోగులు, యజమానుల వాటా పీఎఫ్‌ను కేంద్రం మూడు నెలల పాటు చెల్లిస్తుంది.
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన, భారత్ ఆత్మనిర్భర్ కింద ఈ జూన్ నుంచి ఆగస్టు వరకు మరో మూడు నెలల పాటు ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ 24శాతం (12 శాతం ఉద్యోగుల వాటా, 12 శాతం యజమానుల వాటా) పొడిగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కేబినెట్ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ చర్యతో 72 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలిగిందని జవదేకర్ తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను మరో ఐదు నెలల పాటు పొడిగించేందుకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు. దీంట్లో 81 కోట్ల మందికి 203 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు నవంబర్ వరకు కేటాయించనున్నట్లు చెప్పారు. .