Covid Vaccine
AIIMS Chief: భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో కోవిడ్ వ్యాక్సిన్ బలంగా పనిచేస్తుంది. వ్యాక్సిన్ వల్లే కరోనా కేసులు కూడా తగ్గుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, వ్యాక్సిన్ రెండు డోస్‌లను తీసుకున్న వ్యక్తులు బూస్టర్ డోస్ (మూడవ డోసు) కోసం డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది నిపుణులు దీని అవసరం గురించి ఇప్పటికే చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ఢిల్లీకి చెందిన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ ఇంకో ఏడాది తర్వాతే, బూస్టర్ డోస్ తీసుకునే అవకాశం వస్తుందని చెప్పారు.
బలహీన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారికి బూస్టర్ డోసు అవసరమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల కమిటీ కూడా చెప్పగా.. ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఎప్పుడైనా బూస్టర్ డోస్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇంతకుముందు ఇచ్చిన రెండు డోసుల ప్రభావంపై ఆధారపడి మూడో డోసు ఉంటుందన్నారు.
బూస్టర్ డోసు ఇచ్చే విషయంపై ప్రభుత్వం కూడా ఆలోచన చేయట్లేదని, యాంటీబాడీల ఆధారంగానే బూస్టర్ షాట్ ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. రెండో డోసు తీసుకున్న ఏడాది తర్వాత బూస్టర్ డోసు గురించి ఆలోచించాలన్నారు. వైరస్ ప్రభావం అధికంగా ఉండేవారకి, వృద్ధులకి ప్రయారిటీ ఇస్తామని వెల్లడించారు గులేరియా.
ఇక దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ గులేరియా విజ్ఞప్తి చేశారు. పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూజ తర్వాత కరోనా కేసులు వేగంగా వ్యాపించాయని గులేరియా అన్నారు.