గర్భిణిలు, పిల్లలను కనాలనుకునేవారు కోవిడ్‌ టీకా తీసుకోవచ్చా? వ్యాక్సిన్ వల్ల పుట్టబోయే బిడ్డకు ఏదైనా ప్రమాదం ఉందా?

గర్భంతో ఉన్నవారు, పిల్లలను కనాలనుకునే వారు కోవిడ్‌ టీకా వేయించుకోవచ్చా? పుట్టబోయే బిడ్డకు టీకా వల్ల ఏదైనా ప్రమాదం ఉందా?

Pregnant Vaccine

Pregnant Vaccine : కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే ఒక్కటే దారి. అదే వ్యాక్సిన్. అందుకే, అర్హులైన వారందరూ టీకా తీసుకోవాలని ప్రభుత్వాలు, వైద్య నిపుణులు నెత్తీ, నోరు బాదుకుని చెబుతున్నాయి. దయచేసి అందరూ టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18ఏళ్లు దాటిన వారందరూ తప్పక వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉచిత వ్యాక్సిన్‌ అందజేస్తామని తెలిపాయి. ఈ పరిస్థితుల్లో కోవిడ్‌ టీకాపై ఇంకా అనేక అపోహలు, భయాలు, అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో ప్రెగ్నెన్సీకి సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని గైనకాలజిస్ట్‌ లు చెబుతున్నారు.

గర్భంతో ఉన్నవారు, పిల్లలను కనాలనుకునే వారు కోవిడ్‌ టీకా వేయించుకోవచ్చా? అన్న ప్రశ్న ఎక్కువమంది నుంచి వినిపిస్తోంది. దీనికి వైద్య నిపుణులు సమాధానం ఇచ్చారు. ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు. 4-6 నెలల గర్భంతో ఉన్నవారు వ్యాక్సిన్ వేయించుకోవచ్చని చెబుతున్నారు. కొందరు ప్రెగ్నెన్సీ అని తెలియక వ్యాక్సిన్‌ వేయించుకున్నా ఇబ్బంది లేదంటున్నారు.

అయితే, వ్యాక్సిన్‌ వేయించుకునే ముందు తప్పనిసరిగా ఒకసారి గైనిక్‌ ని సంప్రదించాలని, వారు ఇచ్చే సూచనలు, సలహాని పాటించడం మంచిందని నిపుణులు అంటునన్నారు. టీకా తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డకు ఎలాంటి ప్రమాదం ఉండదంటున్నారు. కాగా.. డాక్టర్ల సలహాలు, సూచనలను మాత్రం తప్పకుండా పాటించాల్సి ఉంటుందని తేల్చి చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నాక సాధారణ వ్యక్తుల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే (జ్వరం, నొప్పులు) కనిపిస్తాయో.. అదే విధంగా గర్భిణుల్లోనూ అవే సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయని డాక్టర్లు చెప్పారు.

గర్భిణులు కోవిడ్ టీకా నిర్భయంగా తీసుకోవచ్చని అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) చెప్పింది. ఇక సౌదీ అరేబియా ఆరోగ్య శాఖ సైతం ఇలాంటి సూచనే చేసింది. గర్భిణులు టీకా తీసుకోవచ్చని చెప్పింది. ఎలాంటి భయాలు, అనుమానాలు, అపోహలు అవసరం లేదని చెప్పింది.