Mask Wash : మాస్కులను ఉతకొచ్చా? లేదా? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

మాస్కుల విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన సందేహం.. వాడిన మాస్కుని ఉతకొచ్చా? లేదా? చాలామందికి ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న.

Mask Wash : కరోనావైరస్ మహమ్మారి మరోసారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. సెకండ్ వేవ్ లో వైరస్ తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. మన దేశంపై కరోనా దండయాత్ర ఎత్తింది. నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. కోవిడ్ దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు శ్మశాన వాటికలు ఫుల్ అయ్యాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యాక్సిన్ వచ్చినా కరోనాకు అడ్డుకట్ట పడకపోవడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలో కరోనా నుంచి కాపాడుకోవడానికి కచ్చితంగా అందరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు నెత్తీనోరు బాదుకుంటున్నాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో జాగ్రత్తల ద్వారానే కొవిడ్ ను కట్టడి చేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

దీంతో అంతా వివిధ రకాల మాస్కులు వాడుతున్నారు. అయితే, మాస్కుల విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన సందేహం.. వాడిన మాస్కుని ఉతకొచ్చా? లేదా? చాలామందికి ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న.

నిపుణులు ఏమంటున్నారంటే.. గుడ్డతో(క్లాత్) చేసిన మాస్కులు అయితే ఉతకొచ్చట. గోరు వెచ్చని నీటిలో ఏదైనా యాంటిసెప్టిక్ లిక్విడ్ వేసి, ఉతికి ఎండలో ఆరబెట్టుకోవచ్చని చెబుతున్నారు. అదే.. N95 లేదా సర్జికల్ మాస్కులనైతే అస్సలు ఉతకొద్దని చెబుతున్నారు. అందుకు బదులుగా.. వాటిని 3 నుంచి 4 రోజులు ఎండలో ఉంచి తిరిగి ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. ఎన్ 95 లేదా సర్జికల్ మాస్కులను ఉతికితే.. అవి ఎందుకూ పనికి రాకుండా పోతాయి. వాటికున్న వాల్వ్స్ డ్యామేజ్ అయితే నిరుపయోగంగా మారతాయి.

అందుకే, ఎట్టి పరిస్థితుల్లో వాటిని వాష్ చేయొద్దని చెబుతున్నారు. ఇక ఆరు బయటకు వచ్చేటప్పుడు రెండు మాస్కులు ధరించడం చాలా మంచిదంటున్నారు. అలాగే ఒక్కొక్కరు 3 నుంచి 4 మాస్కులు దగ్గర ఉంచుకోవడం బెటర్ అంటున్నారు. వాటిని మార్చి మార్చి వాడుకోవడం మేలంటున్నారు. ఇలాంటి జాగ్రత్తలతో మాస్కులు వినియోగిస్తే చాలావరకు సేఫ్ గా ఉండొచ్చన్నది నిపుణుల మాట.

ట్రెండింగ్ వార్తలు