ఏపీ,తెలంగాణకు తక్షణమే ఆక్సిజన్ మళ్లింపు ఆపండి..మోడీకి తమిళనాడు సీఎం లేఖ

తమిళనాడులోని శ్రీపెరంబుదూరు లోని ప్లాంట్ నుంచి ఏపీ,తెలంగాణ రాష్ట్రాలకు 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్

CM Palaniswami తమిళనాడులోని శ్రీపెరంబుదూరు లోని ప్లాంట్ నుంచి ఏపీ,తెలంగాణ రాష్ట్రాలకు 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సరఫరాను తక్షణమే ఆపాలని కోరుతూ తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ మళ్లింపు వల్ల తమ రాష్ట్రంలో ముఖ్యంగా చెన్నై, ఇతర జిల్లాల్లో తీవ్ర సంక్షోభానికి దారి తీసే ప్రమాదముందని పళనిస్వామి ఆ లేఖలో తెలిపారు.

ఇప్పటివరకు తమ రాష్ట్రం ఆక్సిజన్ సరఫరా విషయంలో ఎలాంటి ఆంక్షలు విధించలేదని, ఇతర రాష్ట్రాలకు సహకరించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని పళనిస్వామి పేర్కొన్నారు. అయితే కోవిడ్ కేసులు పెరిగిపోయిన దృష్ట్యా, తమ రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ అవసరాలు కూడా పెరిగిపోయాయని, ఈ కారణంగా తమిళనాడులో తగినంత ఆక్సిజన్ లభ్యత ఉండేలా చూడాల్సి ఉందని ఆయన ప్రధానికి రాసిన లేఖలో వెల్లడించారు.

నేషనల్ ప్లాన్ కింద తమ రాష్ట్రానికి ఆక్సిజన్ కేటాయింపు చాలా తక్కువగా ఉందని సీఎం పళనిస్వామి మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆక్సిజన్ వినియోగం 310 మెట్రిక్ టన్నులు దాటింది.. కానీ కేంద్రం 220 మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించిందని ఆయన తెలిపారు. తమిళనాడుకు ఆక్సిజన్ కేటాయింపు విషయంలో కేంద్రం అంచనా సరిగా లేదన్నారు. తమకంటే తక్కువ యాక్టివ్ కేసులు ఉన్న రాష్ట్రాలకు.. అందునా భారీ స్టీల్ పరిశ్రమలు ఉన్న రాష్ట్రాలకు తమ వద్ద నుంచే ఆక్సిజన్ కేటాయింపులు చేస్తున్నారని తెలిపారు. సమీప భవిష్యత్తులో తమిళనాడుకు 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమవుతుందని, కానీ ప్రస్తుత ప్రొడక్షన్ కెపాసిటీ 400 మెట్రిక్ టన్నులు మాత్రమేనని పళనిస్వామి పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు