Supreme Court : హైవేల దిగ్బంధంతో సమస్యలు పరిష్కారమవుతాయా..రైతుల ధర్మాపై సుప్రీం

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులను దిగ్బంధనం చేసిన రైతులను ఖాళీ చేయించాలని కోరుతూ నోయిడా నివాసి మోనికా అగర్వాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Suprme Farmers

Supreme Court  నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులను దిగ్బంధనం చేసిన రైతులను ఖాళీ చేయించాలని కోరుతూ నోయిడా నివాసి మోనికా అగర్వాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ-ఉత్తర్​ప్రదేశ్​ సరిహద్దు వద్ద నిరసనల కారణంగా నోయిడా నుంచి ఢిల్లీలోని కార్యాలయానికి వెళ్లడం పీడకలలా మారిందని.. 20 నిమిషాల ప్రయాణానికి 2 గంటలు పడుతోందంటూ మోనికా అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం(సెప్టెంబర్-30,2021)జస్టిస్​ సంజయ్​ కిషన్​ కౌల్​ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది.

నిర్దేశించిన ప్రాంతాల్లోనే ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జాతీయ రహదారులను దిగ్బంధించడం సమస్యకు పరిష్కారం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సమస్యలను పరిష్కరించుకోవాలంటే న్యాయ వ్యవస్థ, లేదా పార్లమెంటు చర్చ వంటి మార్గాలు ఉన్నాయని… హైవేలను ఏ విధంగా దిగ్బంధనం చేస్తారని ప్రశ్నిస్తూ, ఇది శాశ్వతంగా జరుగుతోందని, దీనికి ముగింపు ఎక్కడ? అని నిలదీసింది.

ALSO READ టీ,కాఫీలలో ఉండే కెఫిన్ వల్ల ఆరోగ్యానికి నష్టమా?..లాభమా?..

ఈ అంశంపై ప్రభుత్వం ఏం చేస్తోందని సొలిసిటర్​ జనరల్​ తుషార్ మెహతా,అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై స్పందించిన సొలిసిటర్​ జనరల్​ తుషార్ మెహతా.. సమస్య పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీ నియమించినట్లు తెలిపారు. చర్చలకు నిరసనకారులు నిరాకరించారని.. వారిని ప్రతివాదులుగా చేర్చాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ప్రభుత్వ ఆలోచనలు వారికి తెలియబడతాయన్నారు. దీంతో ఇందుకు సంబంధించి పిటిషన్‌ దాఖలు చేయాలని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్-4,2021న జరుగుతుందని తెలిపింది.