Mallikharjuna Kharge
Mallikharjuna Kharge Defamation Case : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో భజరంగ్ దళ్ పై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్ ను బ్యాన్ చేస్తామని ఖర్గే కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో పంజాబ్ కోర్టులో మల్లిఖార్జున ఖర్గేపై పరువు నష్టం కేసు నమోదైంది.
ఈ మేరకు హిందూ సురక్షా పరిషద్ భజరంగ్ దళ్ హింద్ వ్యవస్థాపకుడు హితేశ్ భరద్వాజ్.. మల్లిఖార్జున ఖర్గేపై 100 కోట్ల రూపాయల పరువునష్టం కేసు పెట్టారు. ఈ మేరకు సంగ్రూర్ కోర్టు ఖర్గేకు సమన్లు జారీ చేసింది. జులై10న కోర్టుకు హాజరు కావాలంటూ సివిల్ జడ్జి మరణదీప్ కౌర్ ఖర్గేను ఆదేశించారు. భజరంగ్ దళ్ ను జాతీయ వ్యతిరేక సంస్థగా కాంగ్రెస్ పార్టీ ఆరోపించదని హితేశ్ తన పరువునష్టం దావాలో పేర్కొన్నారు.
అంతేకాకుండా కర్ణాటకలో అధికారంలోకి వచ్చాక భజరంగ్ దళ్ ను బ్యాన్ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేజీ నెంబర్10లో ఉన్న అంశాల ఆధారంగా గురువారం కోర్టును ఆశ్రయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు పంజాబ్ సంగ్రూర్ కోర్టు మల్లిఖార్జున ఖర్గేకు సమన్లు జారీ చేసింది.
కాగా, కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించింది. 136 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. అయితే సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయాన్ని అధష్టానానికే అప్పగించారు. సీఎం రేసులో సిద్ధరామయ్య, డీకే.శివకుమార్ ఉన్నారు.