ఆపరేషన్ కోబ్రా : నోటుకు ట్వీట్లు వేస్తున్న సినిమా వాళ్లు

  • Publish Date - February 20, 2019 / 10:18 AM IST

సినిమావాళ్లను గుడ్డిగా నమ్మేసి వాళ్లు చెప్పినట్లు ఆచరించడం సామాన్యులకు కొత్తేం కాదు. అయితే ఆ నమ్మకాన్ని క్యాష్ చేసుకోవడానికి సినిమా వాళ్లు ఏ మాత్రం వెనకాడట్లేదు. “నోటుకు ట్వీటు ఒప్పందం”. మీరు చదివింది నిజమే.. ఇది కొత్తగా అనిపించవచ్చు కానీ ఇదే వాస్తవం.. సార్వత్రిక ఎన్నికలు వస్తున్న వేళ కోబ్రా పోస్ట్ సంచలన విషయాలను బయటపెట్టింది. “ఆపరేషన్ కరావోక్” పేరుతో కోబ్రా పోస్ట్ సంచలన నివేధికను బయటపెట్టింది. కోబ్రాపోస్ట్ వెబ్ సైట్ నిర్వహించిన ఓ స్టింగ్ ఆపరేషన్‌లో 36మంది సినీ సెలబ్రిటీలు డబ్బులిస్తే ట్వీట్ చేసేందుకు సిద్ధమని అంగీకరించారు.

కోబ్రాపోస్ట్ కథనం ప్రకారం.. ఆ సంస్థ ప్రతినిధులు తమను తాము ఓ పార్టీ పీఆర్వోలమని, పార్టీల వ్యక్తల దగ్గర నుంచి వస్తున్నామంటూ ఆ సినీ సెలబ్రిటీలను పరిచయం చేసుకున్నారు. తాము వివిధ పార్టీలకు పనిచేస్తామని తెలిపారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సహా పలు పార్టీలకు పీఆర్ సేవలు అందిస్తామని చెప్పారు. ఈ క్రమంలో భాగంగా తాము చెప్పిన పార్టీకి అనుకూలంగా ట్వీట్ చేస్తే అందుకోసం భారీ మొత్తంలో డబ్బు ఇచ్చేందుకు సిద్దం అని 36మంది ఒప్పుకున్నట్లు కోబ్రా పోస్ట్ వెళ్లడించింది. 

మొత్తం 36 మంది సినీ, టీవీ సెలబ్రిటీలు తాము ఇచ్చిన ఆఫర్‌కు ఓకే చెప్పారని కోబ్రాపోస్ట్ ఎడిటర్ ఇన్ చీఫ్ అనిరుద్ధ్ భల్ తెలిపారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయా పోస్టులు పెట్టేందుకు అంగీకరించారని, అందుకోసం ఒక్కో పోస్ట్‌కు రూ.2లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఫీజు అడిగినట్టు తమ స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడైందని అనిరుద్ధ్ చెప్పారు. ఎనిమిది నెలల కాంట్రాక్ట్ కోసం కొందరు ఏకంగా రూ.20కోట్లు కూడా అడిగినట్టు ఆయన వివరించారు. ఫీజు మొత్తం బ్లాక్ మనీలో కావాలా? వైట్‌లో కావాలా అని అడిగితే, కొందరు మాత్రం మొత్తం చెక్‌ రూపంలో ఇవ్వాలని కోరగా.. మరికొందరు మాత్రం క్యాష్ రూపంలో అడిగినట్లు తెలిపారు. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత తమ పాన్ కార్డు డిటెయిల్స్ ఇచ్చేందుకు కొందరు అంగీకరించినట్టు కోబ్రాపోస్ట్ తెలిపింది.

 కోబ్రాపోస్ట్ స్టింగ్ ఆపరేషన్ ప్రకారం..  జాకీ ష్రాఫ్, కైలాష్ ఖేర్, వివేక్ ఒబెరాయ్, సోను సూద్, శ్రేయాస్ తల్పాడే, సన్నీలియోనీ, శక్తి కపూర్, అమీషా పటేల్, టిస్కా చోప్రా, రాఖీసావంత్, టీవీ నటులు పంకజ్ ధీర్, నికితిన్ ధీర్, పునీత్ ఇసార్, రాజ్‌పాల్ యాదవ్, మినిషా లాంబా, హితేన్ తేజ్వానీ ఆయన భార్య గౌరీ ప్రధాన్, మహిమా చౌదరి, రోహిత్ రాయ్, అమన్ వర్మ, కోనా మిత్రా, రాహుల్ భట్ లు ఈ ఢీల్ కు ఒప్పుకున్నారు. విద్యా బాలన్, అర్షద్‌ వార్సీ, సౌమ్య టాండన్, రజా మురాద్‌ వంటి అతి కొద్ది మంది సెలబ్రిటీలు మాత్రం తమ అంతరాత్మకు వ్యతిరేకంగా పనిచేయలేమంటూ పక్కకు తప్పుకున్నారు.

 అత్యాచార కేసులు, వంతెనలు కూలడం వంటి ప్రమాద ఘటనల్లో ప్రభుత్వాన్ని వెనకేసుకుని రావడం కూడా ఈ పోస్ట్‌ల్లో ఉంటాయని స్పష్టంగా చెప్పారు. ఇదంతా తమకు సమ్మతమేననీ, పోస్ట్‌లు, ట్వీట్‌లు చేస్తామంటూ ఆ వెబ్ రిపోర్టర్లతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సెలబ్రిటీలు ముందుకొచ్చారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే కొందరు అత్యుత్సాహవంతులు ముందుగానే ట్వీట్ లు చేసి ఆయా పార్టీలను పొగడ్తలతో ముంచెత్తారు. 

Read Also :ప్రాణాలు కాపాడిన హెల్మెట్ : ఎగిరిపడ్డా భలే బతికింది
Read Also :డెవలపర్లకు గుడ్ న్యూస్: గూగుల్ కొత్త వెబ్ డొమైన్ వచ్చేసింది