ఆడపులి: కత్తితో బెదిరించినా భయపడలేదు, వదల్లేదు. దొంగలకు చుక్కలు చూపించింది

  • Publish Date - September 2, 2020 / 11:27 AM IST

తన చేతిలోని ఫోన్ లాక్కుని పారిపోతున్న దొంగలకు ఒక బాలిక (15) చుక్కలు చూపించింది. ఏ మాత్రం భయపడకుండా సివంగిలాగా దూకి వాళ్ల ఆట కట్టించింది. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పంజాబ్ లోని జలంధర్ నగరంలో ఈ ఘటన జరిగింది.



కత్తితో గాయపరిచినా వెనక్కి తగ్గలేదు:
కుసుమ్ అనే అమ్మాయి వీధిలో నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో బైక్‌పై ఇద్దరు దుండగులు వచ్చారు. అమ్మాయి చేతిలోని ఫోన్ లాక్కున్నారు. ఆ తర్వాత బైక్ పై పారిపోయే ప్రయత్నంలో ఉండగానే, మెరుపు వేగంగా కదిలింది ఆ అమ్మాయి. వెనుక కూర్చున్న ఒక దొంగను దొరక బుచ్చుకుంది. అతగాడు బైక్‌ దిగి ఆ అమ్మాయిని తీవ్రంగా కొట్టాడు. జట్టు పట్టుకుని లాగాడు. కత్తితో బెదిరించాడు. కత్తితో ఆమెను గాయపరిచాడు.

దొంగకు బడితె పూజ చేసిన స్థానికులు:
అయినా అమ్మాయి ఏ మాత్రం వెరవలేదు. పట్టు విడవలేదు. చేతికి దొరికిన ఆ దొంగను పారిపోనివ్వకుండా నిలువరించింది. దొంగ కత్తితో గాయపరిచినా కుసుమ్ అతడిని వదల్లేదు. ఆ ఇద్దరి మధ్య కాసేపు పెనులాగుట జరిగింది. ఇంతలోపు స్థానికులు రావడంతో బైక్ పై ఉన్న దొంగ పారిపోగా, దొరిగిన దొంగకు బడిత పూజ చేశారు.

నీ ధైర్యానికి హ్యాట్సాఫ్.. శభాష్ కుసుమ్:
చివరకు కుసుమ్ తన ఫోన్ ను దక్కించుకుంది. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయింది. కాగా, దొంగ కత్తితో చేసిన దాడిలో ఆమె చేతికి గాయమైంది. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో వైరల్ అయ్యింది. అమ్మాయి చూపిన తెగువ, ధైర్యానికి స్థానికులు, నెటిజన్లు ఫిదా అయ్యారు. సాహస బాలిక అని కొనియాడుతున్నారు. శభాష్ అంటూ అభినందనల వర్షం కురిపిస్తున్నారు. దొంగలకు చుక్కలు చూపించిన కుసుమ్.. అమ్మాయిలకు ఇన్సిపిరేషన్ గా నిలిచింది అంటూ పొగిడారు.