Mulayam Singh Yadav Death: ములాయం సింగ్ యాదవ్ మృతికి ప్రముఖుల సంతాపం.. ఎవరేమన్నారంటే..?

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ (82) సోమవారం కన్నుమూశారు. ఆయన మృతిపట్ల రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Mulayam singh Yadav

Mulayam Singh Yadav Death: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ (82) సోమవారం కన్నుమూశారు. ఆయన మృతిపట్ల రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ములాయం సింగ్ యాదవ్ మరణం దేశానికి తీరని లోటని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన సాధించిన విజయాలు అసాధారణమైనవి అని, ఆయన అన్ని పార్టీల గౌరవాన్ని పొందారని అన్నారు. ఆయన కుటుంబానికి మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు.

ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యానికి కీలక సైనికుడిగా ములాయం పనిచేశారని, రక్షణ మంత్రిగా దేశాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేశారని, ములాయం మరణం నన్ను ఎంతగానో బాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.

యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకనయ్య నాయుడు అన్నారు. ఆయనతో నాకు చాలా సంవత్సరాలుగా సుదీర్ఘ అనుబంధం ఉందని, జాతీయ రాజకీయాల్లో ఒక దృఢమైన నాయకుడు, ప్రజానీకానికి మట్టి నాయకుడు అని అన్నారు.

ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన ములాయం తన జీవితకాలం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పని చేశారని కొనియాడారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ములాయం సింగ్ యాదవ్ మరణవార్త ఎంతో బాధ కలిగించిందని అన్నారు. తనకు అత్యంత ఆప్తులు, సోదరుడిని ఈ రోజు కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో కలిసి గతంలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు అన్నారు. అఖిలేష్ యాదవ్ సహా కుటుంబ సభ్యులకు, ఉత్తరప్రదేశ్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.