కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం.. 2028 వరకు ఆ పథకం గడువు పొడగింపు.. దీనివ‌ల్ల ఎవరికి ఉపయోగం.. ప్ర‌యోజ‌నాలేంటి?

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్ పథకాన్ని ప్రారంభించింది. తాజాగా ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం..

PM E-Drive Scheme

PM E-Drive Scheme: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంతోపాటు, ఈవీ ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉద్దేశించి పీఎం ఇ-డ్రైవ్‌ (PM E-DRIVE ) పథకంను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద రూ.10,900 కోట్లు కేటాయించింది. అయితే, ఈ పథకం కాల వ్యవధిని ప్రభుత్వం మరో రెండేళ్లు పొడిగించింది. విద్యుత్ బస్సులు, ఈ-అంబులెన్సులు, ఈ-ట్రక్కులు సహా కొన్ని వాహన విభాగాలకు ఈ పథకం 2028 మార్చి వరకు వర్తించనుంది.

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్ పథకాన్ని ప్రారంభించింది. తాజాగా ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం.. రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం, రిజిస్టర్డ్ ఎలక్ట్రికల్ రిక్షాలు, విద్యుత్ త్రిచక్ర వాహనాలు (ఎల్5)కు మాత్రం ఈ పథకం 2026 మార్చి 31తో ముగుస్తుంది. ఈ పథకంకోసం రూ.10,900 కోట్లు కేటాయించగా.. దాదాపు సగం నిధులు మాత్రమే ఖర్చు అయ్యాయి. మిగిలిన నిధులు ఈ-బస్సులు, ఈ-ట్రక్కులు, ఈ-ఛార్జింగ్ స్టేషన్లు వినియోగించాల్సి ఉంది. గడువులోపు ఈ నిధులు పూర్తిగా వినియోగం అయితే, ఈపథకం గడువు ముగుస్తుంది.

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం మరియు త్రిచక్ర వాహన కొనుగోలుదారులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
ట్రూ, త్రీ వీలర్ ఈ-వాహనాలకు మంజూరు చేసే సబ్సిడీలు 2025-26 చివరితో ముగుస్తాయని కేంద్రం పేర్కొంది. ఈ వాహనాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కిలోవాట్ గంట (KWH)కు రూ.5వేలు, తదుపరి ఏడాది (2026 ఆర్థిక సంవత్సరంలో) కిలోవాట్ గంటకు రూ.2500 ప్రోత్సాహం లభిస్తుంది. ఇది వాహనం ఎక్స్-షోరూం ధరలో 15శాతం వరకు మాత్రమే వర్తిస్తుంది వాహనాల సబ్సిడీతోపాటు.. ఈ పథకం కింద ఫోర్ వీలర్స్ వాహనాలకు 22,000 ఈవీ పబ్లిక్ ఛార్జర్ కేంద్రాలు, ఎలక్ట్రిక్ బస్సులకు 1,800 ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు మంత్రిశాఖ కింద వాహనాల పరీక్షా మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడంపై దృష్టి పెడుతుంది.

ఈ సబ్సిడీ పొడిగింపుతో ఎన్2, ఎన్3 కేటగిరీలలో వచ్చే ఈ-ట్రక్కులకు రూ.9.6లక్షల వరకూ సబ్సిడీ లభించనుంది. ఎన్2 కేటగిరిలో 3.5టన్నుల కంటే ఎక్కువ.. 12టన్నుల లోపు వాహనాలు ఉంటాయి. ఎన్3 కేటగిరీ అంటే 12టన్నులకు మించి.. 55 టన్నుల లోపు వాహనాలు ఉంటాయి.

కేంద్ర మంత్రి హెచ్ డీ కుమారస్వామి మాట్లాడుతూ.. దేశంలో డీజిల్ ట్రక్కులు మొత్తం వాహనాల సంఖ్యలో కేవలం మూడు శాతం మాత్రమే ఉన్నా.. అవి 42శాతం ట్రాన్స్‌పోర్ట్ గ్రీన్‌హౌస్ ఎమిషన్స్‌కు కారణం అవుతున్నాయని అన్నారు. ఈ కారణంగా ఈ-ట్రక్కులకు ప్రోత్సాహం కల్పించడం పర్యావరణ పరిరక్షణకు అత్యంత అవసరంగా పేర్కొన్నారు.

ఈ స్కీంతో పాటు, ఈ-వాహనాల కొనుగోలుపై జీఎస్టీనీ 5శాతం వరకు తగ్గించింది. ఫాజిల్ ప్యూయెల్ వాహనాలపై ఇది 28శాతంగా ఉంది. అలాగే రూ.25,938 కోట్ల విలువైన ఆటో పిఎల్ఐ స్కీం ద్వారా తయారీదారులకు కూడా ప్రోత్సాహాలు లభిస్తున్నాయి.