ఇకపై ఢిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరే..అమల్లోకి GNCTD సవరణ చట్టం

GNCTD Act దేశ రాజధానిలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్న ఈ సమయంలో వివాదాస్పద జీఎన్ సీటీడీ(Government of National Capital Territory of Delhi)సవరణ చట్టం 2021ని అమల్లోకి తీసుకొస్తూ బుధవారం కేంద్ర హోంమంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బిల్లును మార్చి-2021లో పార్లమెంటు ఆమోదించిన విషయం తెలిసిందే. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ తర్వాత ఏప్రిల్- 27 నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం అమల్లోకి రావడంతో ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ చేతుల్లో ఉంటుంది.

ఈ చట్టం ప్రకారం ఢిల్లీ ప్రభుత్వం అంటే..లెఫ్టినెంట్ గవర్నర్ అని అర్థం. దీని ప్రకారం ఢిల్లీలో ఎన్నుకోబడిన ప్రభుత్వంపై మరింత అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కలిగి ఉంటారు. దీంతో ఇక‌పై ఢిల్లీలో కేజ్రీవాల్ ప్ర‌భుత్వం ఏవిధమైన ఎగ్జిక్యూటివ్ నిర్ణయాలు తీసుకోవాలన్నా ముందుగా లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. శాసనసభకు సంబంధించిన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటే, లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి 15 రోజుల ముందు అనుమతి పొందవలసి ఉంటుంది. పరిపాలనా విషయాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటే 7 రోజుల ముందు అనుమతి పొందడం అవసరం.
ఇప్ప‌టికే ఢిల్లీలోని ఆప్ ప్ర‌భుత్వానికి, లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత‌గా వైరం కొన‌సాగుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో ఈ చ‌ట్టం అమ‌ల్లోకి రావ‌డంతో ఇంకెన్ని ఘ‌ర్ష‌ణ‌లు చూడాల్సి వ‌స్తుందో.

కాగా, గత నెలలో పార్లమెంట్ లో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ సహా వివిధ రాజకీయ పార్టీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ చేతుల నుండి అధికారం లాక్కునే కుట్రగా దీనిని ప్రతిపక్షాలు అభివర్ణించాయి. ఈ బిల్లు పార్లమెంటులో పాస్ అయినప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీనిని “భారత ప్రజాస్వామ్యంలో విచారకరమైన రోజు” అని అభివర్ణించారు.

ట్రెండింగ్ వార్తలు