బీజేపీ కొత్త చీఫ్ : JP Nadda ముందు సవాళ్లు 

  • Publish Date - January 20, 2020 / 10:10 AM IST

బీజేపీకి కొత్త సారథి వచ్చారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా కొనసాగిన అమిత్ షా స్థానంలో జేపీ నడ్డా 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నడ్డా ప్రస్తుతం BJP కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. కొత్త అధ్యక్షుడికి ఎన్నో సవాళ్లు ఎదురు కానున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన CAA, NRC, ఇతర చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

పలు రాష్ట్రాల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలో జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. JNUలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు కూడా సవాళ్లుగా మారనున్నాయి. వచ్చే నెలలో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఆప్ వ్యూహాలు రచిస్తోంది. ఈ ఎన్నికలు నడ్డాకు పెను సవాల్‌గా మారనున్నాయి.

కేజ్రీ తరపున వ్యూహాలు రచిస్తున్న ప్రశాంత్ కిశోర్ ప్లాన్స్‌ను నడ్డా ఏ మేరకు ఢీ కొట్టనున్నారో చూడాలి. పలు రాష్ట్రాల్లో ఇటీవలే జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారానికి దూరంగా ఉంది. మహారాష్ట్రలో బీజేపీని కాదని..కాంగ్రెస్‌తో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జార్ఖండ్‌లో ఓటమి..ఇలా పలు అంశాలల్లో బీజేపీ వెనుకంజలో ఉందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. ఏపీలో జనసేన పార్టీ బీజేపీకి మద్దతు తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. 
 

ఇక నడ్డా విషయానికి వస్తే :-
2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం…హోం మంత్రిగా అమిత్ షా బాధ్యతలు తీసుకున్నారు. నాటి నుంచి బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా బాధ్యతలు చేపడుతారని ఒక ప్రచారం జరిగింది. గత మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ఇన్ ఛార్జీగా వ్యవహరించారు. 80 స్థానాలకు గాను 62 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.

పదేళ్లుగా పార్టీతో పయనిస్తున్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. RSSకు సైతం ఆయన సేవలందించారు. గత సంవత్సరం జులైలో జేపీ నడ్డా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో అధ్యక్షుడిగా నడ్డా ఎలా పార్టీని ముందుకు తీసుకెళుతారో చూడాలి. 

Read More : అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలివే