చంద్రయాన్ -2 ప్రాజెక్టులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్టిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ 2019, సెప్టెంబర్ 02వ తేదీ సోమవారం విజయవంతంగా విడిపోయింది. మధ్యాహ్నం 1.15 నిమిషాలకు ల్యాండర్ విడిపోయిందని ఇస్రో ప్రకటించింది. 50 మిల్లీ సెకన్లలో విడిపోయే ప్రక్రియ పూర్తయ్యింది. జులై 22న చంద్రయాన్ – 2 నింగిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ల్యాండర్ విడిపోయే దృశ్యాలను ఇస్రో శాస్త్రవేత్తలు ఆసక్తిగా చూశారు. చందమామ ఉపరితలంపై ల్యాండింగ్ ప్రక్రియకు మరింత చేరువ కానుంది.
చంద్రయాన్ – 2 వ్యోమనౌక పై భాగంలో ల్యాండర్ ఉంది. దీనిని ప్రత్యేక బోల్టులు, క్లాంపులు ఏర్పాటు చేశారు. నిర్దేశిత కక్ష్య పరిధిలోకి చేరగానే ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయేలా ఇస్రో సంకేతాలు పంపింది. తొలుత ఆర్బిటర్, ల్యాండర్‌ను సంధానించే రెండు బోల్టులు తెగిపోయాయి. దీంతో ల్యాండర్ వేరు పడినట్లైంది.
ఆగస్టు 20వ తేదీన చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. అనంతరం నాలుగుసార్లు దాని కక్ష్యను ఇస్రో తగ్గించింది. ఆదివారం సాయంత్రం 6.21 గంటలకు ఐదోసారి విజయవంతంగా నిర్వహించింది. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో మరోసారి ల్యాండర్ కక్ష్యను తగ్గిస్తారు. 35 కిలోమీటర్లు..97 కిలోమీటర్ల కక్ష్యలోకి ఇది చేరుతుంది. సెప్టెంబర్ 07వ తేదీన మరో కీలక ఘట్ట పరిణామం చోటు చేసుకబోతోంది. వ్యోమనౌకలోని రాకెట్లను మండించడం ద్వారా దానిని కిందకు దించుతారు. అనంతరం 15 నిమిషాల్లో ల్యాండర్..చంద్రుడి దక్షిణ ధృవానికి చేరువలోని ప్రాంతంలో దిగనుంది.