జాబిలికి చేరువగా : చంద్రయాన్ – 2..మూడో ఘట్టం విజయవంతం

  • Published By: madhu ,Published On : September 5, 2019 / 08:12 AM IST
జాబిలికి చేరువగా : చంద్రయాన్ – 2..మూడో ఘట్టం విజయవంతం

Updated On : May 28, 2020 / 3:45 PM IST

చంద్రయాన్ – 2 ప్రయోగంలో మూడో ఘట్టం విజయవంతమైంది. మిషన్‌లో విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడికి దగ్గరగా ప్రవేశించేందుకు రెండోసారి కక్ష్య దూరాన్ని తగ్గించారు. సెప్టెంబర్ 05వ తేదీ గురువారం ఉదయం 3.42 గంటలకు శ్రాస్త్రవేత్తలు కక్ష్య దూరాన్ని తగ్గించి..ఇందుకు ల్యాండర్‌లో నింపిన ఇంధనాన్ని 9 సెకన్ల పాటు మండించారు. ప్రస్తుతం ల్యాండర్ చంద్రుడికి దగ్గరగా ఉంది. 

సెప్టెంబర్ 7వ తేదీన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలంపై దిగనుంది. శనివారం తెల్లవారుజామున ఒంటిగంట నుంచి 2 గంటల మధ్య ల్యాండర్‌లోని ఇంజిన్‌ను మండించి.. చంద్రుడి ఉపరితలంవైపు మళ్లిస్తామని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. అరగంట ప్రయాణం అనంతరం ఒంటిగంట 30 నిమిషాల నుంచి 2.30 గంటల మధ్య ల్యాండర్‌ ఉపరితలంపై సున్నితంగా దిగుతుందన్నారు.

ఆ తర్వాత ఉదయం 5.30 గంటల నుంచి 6.30 గంటల మధ్య ల్యాండర్‌ నుంచి ప్రజ్ఞ రోవర్‌ బయటికి వస్తుందని, ఉపరితలంపైకి దిగి పరిశోధనలను ప్రారంభిస్తుందని తెలిపారు. ల్యాండర్‌, రోవర్‌ కలిపి 14 రోజులపాటు పరిశోధనలు చేయనున్నాయి. ఆర్బిటార్‌ ఏడాదిపాటు కక్ష్యలోనే తిరుగుతూ తన పరిశోధనలను కొనసాగిస్తుంది.

విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై దిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, విక్రమ్‌ కచ్చితంగా ఉపరితలంపై దిగుతుందని, దీంతో మన దేశం రష్యా, అమెరికా, చైనా సరసన నిలుస్తుందని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. చంద్రుడికి దగ్గరగా 96 కిలోమీటర్లు, చంద్రుడికి దూరంగా 125 కిలోమీటర్లు ఎత్తులో వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ..ల్యాండర్ పరిస్థితిని తెలియచేయనుంది.
Read More : చిదంబరం బెయిల్‌కు సుప్రీం నో