Chandrayaan-3: ఇప్పుడు రోవర్ ఏమైందంటే? ఇక మన ఆశలు..? చంద్రయాన్-4 గురించి తెలుసా?

చంద్రయాన్-4 ప్రయోగాన్ని మాత్రం జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా)తో కలిసి ఇస్రో చేపట్టనుంది. చంద్రయాన్-4ను జపాన్ కు చెందిన హెచ్3 రాకెట్...

Chandrayaan 3-India Moon lander

ISRO: చంద్రుడిపై మళ్లీ లూనార్ నైట్ (14 రోజులపాటు చీకటి) మొదలైంది. భారత కీర్తిని మరోసారి జగద్వితం చేసేలా ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సూపర్ సక్సెస్ అయి, చందమామకు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టిన విషయం తెలిసిందే. తొలి 14 రోజుల పాటు పరిశోధనలు చేసిన రోవర్, ల్యాండర్ నుంచి ఆ తర్వాత దాదాపు నెల రోజులుగా సరైన కమ్యూనికేషన్ అందడం లేదు.

రోవర్ కదలికలపై ఆశలు వదులుకోకుండా ఇస్రో నిన్నటివరకు అనేక ప్రయోగాలు చేసింది. తాజాగా, రోవర్ కొన్ని సెంటీమీటర్ల మేర కదిలిందని శాస్త్రవేత్తలు చెప్పిన విషయం విదితమే. ఇప్పుడు చంద్రుడిపై మళ్లీ లూనార్ నైట్ ప్రారంభం కావడంతో ఈ 14 రోజుల పాటు ల్యాండర్, రోవర్‌ ను కదిలించేందుకు ఇస్రో ప్రయోగాలు చేసే అవకాశం లేకుండాపోతుంది.

మరో 14 రోజులు ఆగాలి..

ఒకవేళ విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ను తిరిగి యాక్టివ్ చేయాలని ఇస్రో భావిస్తే మరో 14 రోజులు ఆగాల్సి ఉంటుంది. ప్రస్తుతం చంద్రుడిపై ఉన్న లూనార్ నైట్ కారణంగా అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 250 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే అవకాశం ఉంది. 14 రోజుల తర్వాత రోవర్ తో ఇస్రో కమ్యూనికేషన్ ను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి.

అయితే, గత 14 రోజులుగా ఆ ప్రయత్నాలు అంతగా సఫలం కాకపోవడంతో ఇస్రో మరో రెండు వారాల తర్వాత మళ్లీ ఆ ప్రయత్నాలు చేస్తే అంతకంటే క్లిష్టమైన ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ, ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఆశావాద దృక్పథంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పష్టమైన ప్రకటన మాత్రం ఇస్రో ఇప్పటివరకు చేయలేదు. ఇప్పటికే ల్యాండర్, రోవర్ తమకు అప్పగించిన పనిని ముగించాయని ఇస్రో అంటోంది.

శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

ఇస్రో మాజీ చీఫ్ జి.మాధవన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గత 14 రోజులుగా విక్రమ్ ల్యాండర్ నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ కూడా లేదని, దీంతో రోవర్ ను మేల్కొలిపే అవకాశాలు సన్నగిల్లాయని చెప్పారు. -200సీ నుంచి -250సీ (-328ఎఫ్ నుంచి -418ఎఫ్) మధ్య ఉష్ణోగ్రతను తట్టుకునేలా ల్యాండర్, విక్రమ్ ను రూపొందించలేదని తెలిపారు.

చంద్రయాన్-1 మిషన్ చీఫ్ మైలస్వామి అన్నాదురై మాట్లాడుతూ… విక్రమ్ ల్యాండర్ నుంచి కమ్యూనికేషన్ కోసం ప్రయత్నాలు జరుపుతూనే ఉంటామని, అయితే, సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వివరించారు. కాగా, చీకటిని చీల్చుతూ జాబిల్లిపై 14 రోజుల తర్వాత మళ్లీ వెలుగు వచ్చినప్పటికీ.. ల్యాండర్ తో కమ్యూనికేషన్ అందకపోతే చంద్రయాన్-3 కథ ముగిసినట్లే. ఇక చంద్రయాన్-4పైనే మన దృష్టంతా.

చంద్రయాన్-4 గురించి తెలుసా?
చంద్రయాన్-3 కథ ముగుస్తోంది. భారత్ ఇక చంద్రయాన్-4పై దృష్టి పెట్టింది. లూనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్ గానూ దీన్ని పిలుస్తారు. దీని రోవర్ కూడా చంద్రుడిపై దక్షిణ ధ్రువ ప్రాంతంలోనే అడుగుపెడుతుంది. చంద్రయాన్-4 ప్రయోగాన్ని మాత్రం జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా)తో కలిసి ఇస్రో చేపట్టనుంది. చంద్రయాన్-4ను జపాన్ కు చెందిన హెచ్3 రాకెట్ జాబిల్లిపైకి మోసుకెళ్లనుంది. ల్యాండర్ ను ఇస్రో అభివృద్ధి చేస్తుంది. చంద్రయాన్-4 ప్రయోగాన్ని 2026-2028 మధ్య చేపట్టే అవకాశం ఉంది.

Chandrayaan-3 Mission : మరో అద్భుతం సృష్టించిన ఇస్రో.. విక్రమ్ ల్యాండర్లో కదలిక..!

ట్రెండింగ్ వార్తలు