అక్రమ హోర్డింగ్ కూలి యువతి మృతి….ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం!

చెన్నైలో అధికార పార్టీకి చెందిన బ్యానర్ పైన పడిన కారణంగా సుభశ్రీ(22) అనే మువతి ప్రాణాలు కోల్పోవడంపై డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ స్పందించారు. అక్రమ బ్యానర్లు మరో ప్రాణాన్ని బలిగొన్నాయని స్టాలిన్ అన్నారు.  ప్రభుత్వ నిర్లక్ష్యం,పోలీసుల అసమర్థత కారణంగానే సుభశ్రీ ప్రాణాలు కోల్పోయిందన్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అధికార దాహానికి,అరాచక పాలన కారణంగా రాష్ట్రంలో ఇంకెతమంది ప్రాణాలు కోల్పోవాలి అని స్టాలిన్ ప్రశ్నించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బ్యానర్ సంస్కృతిని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని డీఎంకే ఎమ్మెల్యే ఈ.కరుణానిధి తెలిపారు. ఇప్పుడు సుభశ్రీ మరణానికి ఎవరు బాధ్యత వహిస్తారు అని ఆయన ప్రశ్నించారు. బాధితురాలి కుటుంబానికి భారీగా నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 

గురువారం(సెప్టెంబర్-12,2019)సాయంత్రం దక్షిణ చెన్నైలో స్కూటీపై ఇంటికి వెళుతున్న సుభశ్రీపై అధికార పార్టీ ఏఐఏడీఎంకే పార్టీ బ్యానర్ ఒక్కసారిగా ఆ యువతిపై పడటంతో ఆమె బ్యాలెన్స్ కోల్పోయి రోడ్డుపై పడింది. అయితే, అప్పుడే వేగంగా వస్తున్న వాటర్ ట్యాంకర్ ఆమెపై నుంచి దూసుకెళ్లడంతో శుభశ్రీ ప్రాణాలు కోల్పోయింది.