Chennai
Chennai Rainfall : చెన్నై మరోసారి ప్రమాదపుటంచున నిలిచింది. కుంభవృష్టికి చెన్నై సిటిలోనూ, శివారు ప్రాంతాల్లో రహదారులు, కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. ఇప్పటికే మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. గురువారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు చెన్నైలోని సుమారు 500 వీధుల్లో మోకాలి లోతు ప్రవహిస్తోంది. పూందమల్లి, ఆవడి, అంబత్తూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో చెరువు గట్టులు తెగిపోవడంతో వరదలు ముంచెత్తాయి. కాంచీపురం నుంచి హైవేను కలిపే మార్గం పాలారు నది వరద ఉధృతికి కొట్టుకుపోయింది. వరద బాధితులను ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు రక్షిస్తున్నాయి.
Read More : South Africa : ఒమిక్రాన్‌కు అంత సీన్ లేదు..అనవసరంగా హైప్ చేస్తున్నారు
అత్యధికంగా 24 గంటల్లో అవడిలో 20 సెంటీమీటర్లు, చెంగల్పట్టులో 18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చెన్నై శివార్లలోని ఆలందూరు, పజవంతాంగల్, ఎయిర్‌పోర్టు, పల్లవరం, పెరంగళత్తూరు, క్రోంపేట పూర్తిగా నీట మునిగాయి. తాంబరంలో చాలామంది వరద నీటిలో చిక్కుకుపోయారు. మోకాలి లోతు ప్రహిస్తున్న వర్షపు నీటిలో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పలు వాహనాలు మొరాయించాయి. వేలాది కార్లు, బైక్‌లు నీట మునిగాయి. నెల వ్యవధిలో చెన్నై మూడోసారి జలదిగ్బంధమైంది. చెన్నైలో 2015 తర్వాత ఆ స్థాయి వర్షపాతం ఇప్పుడు నమోదైంది. గత నెల 1 నుంచి శనివారం వరకు చెన్నైలో 119.9 సెం.మీ.వర్షపాతం రికార్డయ్యింది. నెల వ్యవధిలో చెన్నై సిటీలో వంద సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెన్నైలో నగర చరిత్రలో ఈ స్థాయిలో వర్షపాతం నమోదవడం 200 ఏళ్ల చరిత్రలో ఇది నాలుగోసారి. ఈ ఏడాది ఇదే సమయంలో సాధారణ వర్షపాతం కంటే 75 శాతం అధికంగా వర్షం కురిసిందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Read More : Gautham Gambhir: పోలీసుల్లోనే ఐసిస్ గూఢచారులున్నారు – గౌతం గంభీర్
తమిళనాడును వర్షాలు వీడట్లేదు. తమిళనాడులోని 17 జిల్లాల్లో మూడు రోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి. తూత్తుకుడి, తిరునల్వేలి, విరుద్‌నగర్, శివగంగ, దిండిగుల్, మధురై జిల్లాల్లోనూ కుండపోత వర్షాలకు లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రామేశ్వరంలో వర్షం పడుతూనే ఉంది. ఈశాన్య రుతుపవనాల తీవ్రత, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అండమాన్ తీరంలో రేపు ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో..తమిళనాడు అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నై సహా 14 జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. తిరువణ్ణామలై, కళ్లకుర్చి, కన్నియాకుమారి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలున్నాయి.