Chhattisgarh Joint Health Director Who Took Second Dose Of Covid Vaccine Last Week Dies
Chhattisgarh ఛత్తీస్‌ఘడ్ హెల్త్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ సుభాష్ పాడే బుధవారం(ఏప్రిల్-14,2021) కరోనా వైరస్‌తో మృతి చెందారు. కాగా, మార్చి నెల చివరి వారంలో ఆయన కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం ఆయనకు దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించడంతో సోమవారం రాయ్‌పూర్ లోని ఎయిమ్స్ హాస్పిటల్ లో చేరారు.
అయితే మంగళవారం రాత్రి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం.. ఆక్సిజన్ లెవెల్స్ అందకపోవడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించగా బుధవారం కన్నుమూశారని రాయపూర్ ఎయిమ్స్ డైరక్టర్ డాక్టర్ నితిన్ ఎమ్ నాగర్కర్ తెలిపారు. అయితే, వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న 4-6 వారాల తర్వాతనే కోవిడ్ ను నిరోధించే యాంటీబాడీలు శరీరంలో ఏర్పడతాయని అంబేద్కర్ హాస్పిటల్స్ మైక్రోబయాలజీ హెడ్ డాక్టర్ అర్వింద్ నీరల్ తెలిపారు.
అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్ ప్రకారం…సమర్థవంతమైన రోగనిరోధకత పొందిన తర్వాత కూడా ఎవరికైనా తిరిగి వైరస్ సోకినట్లయితే.. వారు తీవ్రంగా అనారోగ్యానికి గురికాకపోవచ్చు మరియు వారి ఆక్సిజన్ స్థాయి బాగానే ఉంటుందని అర్వింద్ నీరల్ తెలిపారు. చాలా సందర్భాలలో వారికి వెంటిలేటర్ సపోర్ట్ అవసరం లేదని తెలిపారు. అయినప్పటికీ, అసాధారణమైన మరియు అరుదైన సందర్భాలు ప్రతిచోటా సాధ్యమనని..1% మందికి మాత్రమే ఇలా సంభవిస్తుంది, రోగనిరోధకత ప్రభావవంతంగా లేదని చెప్పలేమని ఆయన వివరించారు. కాగా,64ఏళ్ల సుభాష్ పాండేకి హైపర్ టెన్షన్,డయోబెటిస్ ఉన్నాయి.గతేడాది కరోనా బారిన పడిన సుభాష్ పాండే.. హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకొని కోలుకున్నారు.