కరోనా నుంచి కోలుకున్న చోటారాజన్..తిరిగి తీహార్ జైలుకి

అండర్​వరల్డ్​ డాన్​, గ్యాంగ్​స్టర్​ చోటా రాజన్ కరోనా నుంచి కోలుకున్నాడు.

Chhota Rajan

Chhota Rajan అండర్​వరల్డ్​ డాన్​, గ్యాంగ్​స్టర్​ చోటా రాజన్ కరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో తిరిగి అతడిని ఢిల్లీలోని తిహార్​ జైలుకు మంగళవారం తరలించినట్లు అధికారులు తెలిపారు. కాగా,ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న 61 ఏళ్ల చోటా రాజన్ ఏప్రిల్-26న కరోనా బారినపడటంతో ట్రీట్మెంట్ కోసం అతడిని ఢిల్లీలోని ఎయిమ్స్ కి తరలించారు అధికారులు.

అయితే గత శుక్రవారం పరిస్థితి విషమించి చోటా రాజన్ చనిపోయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత కాసేపటికే అందులో నిజం లేదని ఎయిమ్స్ ట్రామా చీఫ్ డాక్టర్ రాజేష్ మల్హోత్రా స్పష్టం చేశారు. చోటా రాజన్ చనిపోయాడంటూ వెలువడిన వార్తలు నిజం కాదని జైలు అధికారులు కూడా కొట్టిపారేసిన విషయం తెలిసిందే.

కాగా,ముంబైలో సినిమా టిక్కెట్‌లను బ్లాక్‌లో అమ్ముతూ తన నేర ప్రస్థానాన్ని ప్రారంభించాడు చోటా రాజన్‌. తన గురువు బడా రాజన్‌ వద్ద ఉండి అనేక నేరాలకు పాల్పడ్డాడు. కొన్నాళ్లు దావూద్‌ ఇబ్రహీంతో కూడా కలిసి పని చేశాడు. దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడిగా భారత్‌లో అనేక నేరాలకు పాల్పడిన చోటా రాజన్ ని 2015లో ఇండోనేషియాలోని బాలిలో సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 2011లో ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసులో గతేడాది కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. రాజన్‌పై ఉన్న దాదాపు 68 కేసులను సీబీఐ విచారిస్తుండగా.. ఇందులో ఇప్పటికే 4 కేసుల్లో కోర్టులు అతన్ని దోషిగా తేల్చాయి. మరో 35 కేసుల్లో సీబీఐ అధికారుల చార్జిషీట్ దాఖలు చేశారు. వీటిపై తుది విచారణ ఇంకా జరగాల్సి ఉంది.