పురుషులకు ‘ప్రసూతి’సెలవులు : ప్రకటించిన కేంద్రం

‘Maternity’ leave for men: మహిళలకు మాత్రమే ఇప్పటివరకు ప్రసూతి సెలవులు ఉండేవి, కానీ ప్రస్తుతం పురుషులకు ‘ప్రసూతి’ సెలవులను ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి వీరు ఈ సెలవులు తీసుకోవచ్చునని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం (అక్టోబర్ 26, 2020) ఒక ప్రకటనలో వెల్లడించారు.
పెండ్లి కానివారు, భార్య మరణించినవారు, విడాకులు తీసుకున్నవారు, సింగిల్ పేరెంట్స్ గా ఉంటూ తమ పిల్లల ఆలనాపాలనా చూడాల్సిన బాధ్యత ఉన్నవారు ఈ సెలవులకు అర్హులు అవుతారని పేర్కొన్నారు. అలాంటి వారిని సింగిల్ మేల్ పేరెంట్స్ గా గుర్తిస్తారని ఆయన అన్నారు. ఈ లీవ్స్ లో ఉన్నప్పటికీ సాధారణ సమయంలో ఉద్యోగులకు లభించే లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC) ప్రయోజనాలన్నింటిని పొందవచ్చునని మంత్రి పేర్కొన్నారు.
దీని పథకం ప్రకారం, సింగిల్ పేరెంట్ గా పిల్లలను చూసుకునే పురుష ఉద్యోగులకు మొదటి 365 రోజుల సెలవులకు పూర్తి జీతం చెల్లిస్తారు. మరో 365 రోజుల సెలవులకు 80 శాతం జీతం మాత్రమే ఇస్తారు. ప్రస్తుతం ఉన్న నిబంధన ప్రకారం, శారీరక, మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు 22 సంవత్సరాలు వచ్చే వరకు మాత్రమే వారి సంరక్షకులు అవసరమైన సమయంలో ఈ లీవ్స్ తీసుకునేందుకు వీలుంది. అయితే, ఇప్పటి నుంచి ఈ వయోపరిమితి నిబంధనను తొలగిస్తున్నట్లు మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.