దేవుడే కాపాడాడు.. నూకలు ఉన్నాయ్: రెండంతస్తుల మీద నుంచి పడి బతికాడు

  • Publish Date - October 20, 2019 / 10:13 AM IST

భూమి మీద నూకలు ఉంటే భూకంపమే వచ్చినా బతుకుతారు అంటారు కదా? సరిగ్గా ఓ ఐదేళ్ల బాలుడు విషయంలో కూడా ఇదే జరిగింది. రెండు అంతస్తుల ఎత్తు నుంచి కిందపడి కూడా ఓ బాలుడు బతకడం అంటే చిన్న విషయం కాదు కదా? మధ్యప్రదేశ్‌లోని టికమ్‌గఢ్‌లో ఇటువంటి అద్భుతమే జరిగింది. గోరంత ఆయుష్షు ఆ బుడతడిని కొండంత ప్రమాదం నుంచి తప్పించింది.

వివరాల్లోకి వెళ్తే.. టికమ్‌గఢ్‌లో ఓ ఇంటి దగ్గర పైన రెండో అంతస్తులో ఆడుకుంటున్నాడు బాలుడు. తండ్రితో కలిసి ఆడుకుంటూ బాలుడు అదుపు తప్పి పైనుంచి కిందకు పడిపోయాడు. అదే సమయంలో కింద నుంచి ఓ రిక్షా వెళుతుండగా సరిగ్గా అందులో పడ్డాడు. దీంతో బాలుడికి ఏమీ జరగలేదు. వెంటనే బాలుడిని స్థానిక హాస్పిటల్‌కి తరలించి పరీక్షలు చేయించారు.

రిక్షాలో పడడంతో అతనికి ఎటువంటి గాయాలు తగలలేదని, సురక్షితంగా ఉన్నాడని డాక్టర్లు వెల్లడించారు. సమయానికి రిక్షా రాకుంటే ప్రాణాలు పోయేవని.. ఆ భగవంతుడే తమ బిడ్డను రక్షించాడని తల్లిదండ్రులు అంటున్నారు. అచ్చం సినిమాలో జరిగినట్లే దేవుడే రిక్షాను తీసుకుని వచ్చి బాలుడిని కాపాడాడా అన్నట్లు అనిపిస్తుంది వీడియో చూస్తుంటే. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో కనిపించింది.