Covid Third Wave: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం.. మూడో దశ ప్రమాదం పిల్లలకే..

Third Wave threat to Children: ఆంక్షలు కారణమో? ప్రజలకు బయటకు రాకపోవడం కారణమో? కానీ, ఎట్టకేలకు కేసులు తగ్గుముఖం పట్టాయి. మరణాల సంఖ్య పెరుగుతుండగా.. బాధితుల సంఖ్య మాత్రం తగ్గుతోంది. సెకండ్ వేవ్ ఎప్పుడు ముగుస్తుందో అంతుచిక్కని పరిస్థితి ఉంటే, మూడవ దశ ఇంకా ప్రమాదకరంగా ఉండబోతుంది అనే అంచనాలు ఇప్పుడు నిద్రపట్టనివ్వట్లేదు.

ముఖ్యంగా మూడవ దశలో పిల్లలపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫస్ట్ వేవ్‌లో ప్రభుత్వ లెక్కలు ప్రకారం.. ఒక్క శాతం కంటే తక్కువ మంది పిల్లలకు కరోనా సోకగా.. సెకండ్ వేవ్‌లో, మాత్రం పిల్లలలో సంక్రమణ రేటు 10 శాతం వరకు పెరిగింది. పిల్లలు ఇంకా వ్యాక్సిన్ కూడా పొందలేదు. దీనిని బట్టి చూస్తే.. పిల్లలకే 80శాతం వరకు ప్రమాదం మూడవ వేవ్‌లో ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు నిపుణులు.

మాస్క్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజర్లు వాడడం కరోనా రాకుండా ఉండడానికి ముఖ్యమైన అంశాలు కాగా.. వారికి ఆ నిబంధనలు అర్థం చేసుకునేంత మెచ్యురిటీ కూడా ఉండదని, అటువంటి పరిస్థితిలో కరోనా వేగంగా విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మే చివరివరకు కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉండగా.. జూన్‌లో ఒకవేళ స్కూళ్లు తెరుచుకుంటే కరోనాను అడ్డుకోవడం సాధ్యం కాదని చెబుతున్నారు.

ఫస్ట్ వేవ్‌లో ఉన్నప్పుడే సెకండ్ వేవ్ గురించి వైరాలజీ నిపుణులు హెచ్చిరించినా పట్టించుకోలేదు. సెకండ్ వేవ్‌లో మరణాలు శాతం ఎక్కువగా ఉంటుందని చెప్పినా.. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు మరణాల శాతం బాగా పెరిగిపోయింది. మార్చి మొదటి వారంలోనే రెండోదశ ప్రారంభం అవ్వగా.. ఏప్రిల్, మే నెలల్లో తీవ్రంగా మారిపోయింది.

జైపూర్ గోల్డెన్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాఘవేంద్ర పరాషర్ చెబుతున్న వివరాల ప్రకారం.. కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది. సాధారణంగా వైరస్ ప్రభావం ఎనిమిది వారాల వరకు ఉంటుంది. ఈ లెక్క ప్రకారం.. మే చివరివరకు ఈ వేవ్ ప్రభావం తగ్గుతుంది. మాస్కులు పెట్టుకోకపోవడం, గుంపులుగా చేరడం.. రాజకీయ ర్యాలీలు, కుంభమేళాలు.. సెకండ్ వేవ్ ప్రభావాన్ని పెంచాయి. మూడవ వేవ్ మాత్రం.. ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోకపోతే.. స్కూళ్లు ఓపెన్ చేసినట్లైతే పిల్లలు ప్రమాదంలో పడవచ్చు అని అంటున్నారు.

కరోనా ఫస్ట్ వేవ్ దేశంలోకి వచ్చినప్పుడు నిపుణుల సలహాలు, సూచనలు విన్న ప్రభుత్వాలు.. సెకండ్ వేవ్‌లో మాత్రం పట్టించుకోలేదు.. ఫలితంగా రెండోదశలో ఐదు రెట్లు ఎక్కువగా కేసులు నమోదు కావడంతోపాటు చనిపోతున్నవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. వచ్చే అక్టోబరు నుంచి డిసెంబరు వరకు మూడోదశ పొంచి ఉండగా.. ఈలోపు వీలైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్‌లు వేయాలని నిపుణులు అంటున్నారు.

మనదేశంలో చిన్నారుల సంఖ్య 20 కోట్లు వరకు ఉంటుంది. తర్వాత 18 ఏళ్లు దాటిన వారికి ఇప్పుడిప్పుడే మొదలుపెట్టారు.. అందులో కూడా వ్యాక్సిన్‌లు కొరత తీవ్రంగా ఉంది. పిల్లలకు కాకుండా 18 ఏళ్లు దాటిన వారికి రెండు డోసులు ఇవ్వాలంటే 200 కోట్ల డోసులు అవసరం.. ప్రపంచంలోనే ఇంత ఉత్పత్తి లేకపోవడంతో.. 18ఏళ్లలోపు పిల్లకు వ్యాక్సిన్ వెయ్యాలంటే కుదిరేపని కాదు. ఈలోపే మూడవ వేవ్ వచ్చేస్తుంది. దీంతో పిల్లలకు ప్రమాదం ఎక్కువ అని వైరాలజీ నిపుణులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు