Chinese Hackers భారత వ్యాక్సిన్ దిగ్గజ సంస్థలను చైనా టార్గెట్ చేసింది. భారత్‌లో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్ వివరాలను సేకరించేందుకు..చైనా ప్రభుత్వ మద్దతున్న ఓ హ్యాకింగ్ గ్రూప్ భారత్ బయోటెక్,సీరం ఇన్‌స్టిట్యూట్ ఐటీ వ్యవస్థల్లోకి మాల్ వేర్ ప్రవేశపెట్టిందని సింగపూర్,టోక్యో ప్రధానకేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యురిటీ సంస్థ సైఫార్మా తాజాగా ప్రకటించింది.
చైనీస్ హ్యాకింగ్ గ్రూప్ APT10(స్టోన్ పాండా అని కూడా పిలుస్తారు)….సీరం, భారత్ బయోటెక్ ఐటీ వ్యవస్థల్లోని లోపాలను గుర్తించి మాల్‌వేర్ చొప్పించిందని సైఫార్మా పేర్కొంది. వ్యాక్సిన్ లకు సంబంధించిన మోధోసంపత్తి హక్కుల వివరాలను తస్కరించి భారత ఫార్మా కంపెనీలపై పైచేయి సాధించాలనేది దీని వెనుక ఉన్న ముఖ్య లక్ష్యం అని సైఫార్మా చీఫ్,మాజీ బ్రిటన్ ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ M16లో టాప్ సైబర్ అధికారిగా పనిచేసిన కుమార్ రితేష్ తెలిపారు. ముఖ్యంగా APT10… సీరం ఐటీ వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలిస్తోందన్నారు. సీరం ఇన్ స్టిట్యూట్‌కు చెందిన అనేక పబ్లిక్ సర్వర్ల సెక్యురిటీ వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయని హ్యాకర్లు గుర్తించినట్టు ఆయన తెలిపారు.
హ్యాకర్లు..బలహీన వెబ్ అప్లికేషన్లు గురించి కూడా మాట్లాడారని,అంతేకాకుండా బలహీన కంటెంట్-మేనేజ్ మెంట్ వ్యవస్థ గురించి కూడా వాళ్లు మాట్లాడుతున్నారని..ఇది కొంచెం ప్రమాదకరమని రితేష్ తెలిపారు. ఈ వివరాలను తాము భారత్ ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలిపినట్టు కూడా సైఫర్మా తెలిపింది. ఇక, హ్యాకింగ్ గ్రూప్ స్టోన్ పాండా.. చైనా అంతర్గత భద్రతా మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తోందని అమెరికా డిపార్టమెంట్ ఆఫ్ జస్టిస్ 2018లోనే కుండబద్దలు కొట్టింది.
మరోవైపు,భారత్ చైనాలు ప్రస్తుతం పోటాపోటీగా కరోనా టీకాలను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలోని చాలా దేశాలకు భారత్-చైనాలు కోవిడ్-19 వ్యాక్సిన్ లను అమ్మటం మరియు గిఫ్ట్ గా ఇవ్వడం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన అన్ని వ్యాక్సిన్లలో 60శాతానికి పైగా భారత్‌లోనే తయారైనవి కావడంతో టీకా దౌత్యంలో భారత్ చైనాపై పైచేయి సాధించిందనే వ్యాఖ్యలు సర్వత్రా వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ టీకా వివరాలను చైనా తసర్కించేందుకు ప్రయత్నించిందంటూ వస్తున్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, దీనిపై అటు చైనా విదేశాంగశాఖ గానీ..ఇటు భారత్ కానీ ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదు. ఇక సీరం, భారత్ బయోటెక్ సంస్థలు కామెంట్ చేసేందుకు నిరాకరించాయి.
అయితే, ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ కూడా నవంబర్‌లోనే ఇటువంటి దాడుల గురించి హెచ్చరించింది. రష్యా, ఉత్తరకొరియా కేంద్రంగా కొన్ని హ్యాకింగ్ గ్రూపులు.. భారత్, కెనడా, ఫ్రాన్స్, దక్షిణకొరియా, అమెరికాలకు చెందిన ఫార్మా కంపెనీలను టార్గెట్ చేసుకున్నాయని తెలిపింది. ఉత్తరకొరియా హ్యాకర్లు బ్రిటన్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకాను కూడా టార్గెట్ చేసుకున్నారని తెలిపింది. ఐరోపా ఔషధ నియంత్రణ సంస్థపై గతేడాది డిసెంబర్‌లో జరిగిన దాడిలో తమ టీకాకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు లీకైయ్యాయని ఫైజర్ కంపెనీ కూడా గతంలో ప్రకటించింది.