చిన్మయానంద లైంగిక వేధింపుల కేసులో ట్విస్టు చోటు చేసుకుంది. లా స్టూడెంట్..ని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు సెప్టెంబర్ 25వ తేదీ బుధవారం అరెస్టు చేసి జైలుకు తరలించారు. డబ్బులు గుంజేందుకే లా విద్యార్థిని బ్లాక్ మెయిల్ చేస్తుందనే ఆరోపణలు రావడంతో సిట్ అధికారులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ..న్యాయ విద్యార్థిని కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చిన్మయానంద కేసుతో పాటు బాధితురాలిపై కేసు కూడా నమోదు కావడంతో కీలక మలుపు తిరిగింది.
చిన్మయానందకు పలు కాలేజీలున్నాయి. కాలేజీలో హాస్టల్‌లో తాను స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డు చేసిన చిన్మ..పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేశారు. ఆధారాలతో పోలీసులకు న్యాయ విద్యార్థిని కంప్లయింట్ చేయడం..వేధింపుల అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది.
విచారణ అనంతరం కేసుకు సంబంధించి సిట్ ఏర్పాటు చేయాలని యూపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సిట్ అధికారులు ఆమెను..చిన్మయానంద్‌ను విచారించారు. అనంతరం చిన్మయానంద్‌ను సిట్ అరెస్టు చేసింది. ఈయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. తాజాగా విద్యార్థిని అరెస్టు చేయడం..ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు గురువారం దర్యాప్తు చేయనుంది.