ప్రభుత్వ ఆస్తుల రక్షణ ప్రజలదే..మోడీ

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా దేశంలోని జరుగుతున్న ఆందోళనల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవడాన్ని ప్రధాని మోడీ ఖండించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి విగ్ర‌హాన్ని మోడీ ఆవిష్క‌రించారు. వాజ్ పేయి మెడికల్ యూనివర్శిటీ శంకుస్థాన కార్యక్రమంలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ…నాణ్య‌మైన వైద్యాన్ని అందించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు.

ప్రభుత్వ‌ ఆస్తుల‌ను ధ్వంసం చేస్తున్నవారు తాము ఏమి చేశామ‌న్న అంశాన్ని పున‌రాలోచించుకోవాల‌న్నారు.  ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ర‌క్షించుకోవాల్సిన బాధ్య‌త పౌరులదే అని ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు.ఆర్టిక‌ల్ 370, రామ జ‌న్మ‌భూమి లాంటి అంశాల‌ను శాంతియుతంగా ప‌రిష్క‌రించామ‌ని, మూడు దేశాల శ‌ర‌ణార్థుల‌కు పౌర‌స‌త్వం ఇవ్వాల‌న్న బిల్లు కూడా క్లియ‌ర్ అయ్యింద‌ని, 130 కోట్ల మంది భార‌తీయులు అలాంటి స‌వాళ్ల‌ను ధైర్యంగా ఎదుర్కొన్న‌ట్లు మోడీ చెప్పారు.

ఇటీవ‌ల పౌర‌స‌త్వ చ‌ట్టాన్ని వ్య‌తిరేకిస్తూ యూపీలోని రాంపూర్‌లో భారీ విధ్వంసం జ‌రిగింది. అక్క‌డ ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ధ్వంసం చేశారు. అయితే ఆస్తుల‌ను ధ్వంసం చేసిన 28 మంది ఆందోళ‌న‌కారుల‌కు యూపీ ప్ర‌భుత్వం నోటీసులు జారీ చేసింది. వారి నుంచి 14.86 ల‌క్ష‌లు న‌ష్ట‌ప‌రిహారంగా కోరింది. హింస‌కు దిగే వారి ఆస్తుల‌ను జ‌ప్తు చేస్తామ‌ని ఇటీవ‌ల సీఎం యోగి ఆందోళనకారులను హెచ్చరించిన విషయం తెలిసిందే.