పౌరసత్వ సవరణ చట్టం : వెస్ట్ బెంగాల్‌లో రైళ్లకు నిప్పు

  • Publish Date - December 14, 2019 / 02:10 PM IST

పౌరసత్వ సవరణ చట్టం నిప్పు రాజేస్తోంది. దీనిని వ్యతిరేకిస్తున్న ప్రజలు రోడ్లపైకి ఎక్కుతున్నారు. ఆందోళనలు హింసాత్మకరూపంగా మారుతున్నాయి. ప్రధానంగా పశ్చిమబెంగాల్‌లో నిరసనలు పెరుగుతున్నాయి. లగోలా రైల్వే స్టేషన్‌లో నిలిపి ఉంచిన ఐదు రైళ్లకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. నిరసనకారులను అడ్డుకొనేందుకు RPF, రైల్వే సిబ్బంది ప్రయత్నించారు.

హౌరా, ముర్షీదాబాద్ జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. రాస్తారోకోలు, ప్రభుత్వ ఆస్తులు, రైల్వే స్టేషన్ల విధ్వంసం జరిగాయి. నిరసనకారుల చర్యల వల్ల వాహనాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ఉలుబేరియా రైల్వే స్టేషన్‌లో ఓ రైలు ఇంజిన్‌పైకి కొందరు రాళ్ళు రువ్వారు, రైల్వే ట్రాక్‌లపై అడ్డంకులు పెట్టారు. ముర్షీదాబాద్ వ్యాప్తంగా రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది. జంగీపూర్, మహిపాల్, ఇతర రైల్వే స్టేషన్లకు సమీపంలో రైళ్ళను నిలిపేశారు. కొన్ని రైళ్ళను రద్దు చేశారు.

సక్రయిల్ రైల్వే స్టేషన్‌లో టికెట్ కౌంటర్‌ను నిరసనకారులు తగులబెట్టారు. నిరసనకారులు రోడ్లపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. కొందరు ఆందోళనకారులు బస్సులపై రాళ్ళు రువ్వారు. ఎలాంటి ఆందోళనలకు దిగొద్దని సీఎం మమత బెనర్జీ సూచిస్తున్నారు. ప్రజలను ఇబ్బందికి గురి చేయవద్దని..చట్టాన్ని చేతుల్లోకి తీసుకొంటే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. దీనిపై గవర్నర్ స్పందించారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత చట్టంగా మారిపోయిందని..అందరూ ఆమోదించాలని సూచించారు. 
Read More : ఎక్కడ పడితే అక్కడ కుదరదు : ఫోన్ ఛార్జింగ్‌పై SBI వార్నింగ్