హర్యాణా ఎవరిని ఆశీర్వదించబోతుందో అర్థమైంది

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హర్యానాలో బీజేపీ ఎలక్షన్ క్యాంపెయిన్ ను ప్రధాని మోడీ ఇవాళ(సెప్టెంబర్-8,2019)లాంఛనంగా ప్రారంభించారు. హర్యానా ప్రజలు త్వరలో ఎవరిని ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నారో తేలిపోయిందన్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో హర్యానాలోని మొత్తం 10స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించారని,త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరోసారి బీజేపీని ప్రజలు ఆశీర్వదించబోతున్నారని మోడీ అన్నారు.

లోక్ సభలో ఘనవిజయం అందించిన హర్యానా ప్రజలకు ఈ సందర్భంగా మోడీ ధన్యవాదాలు తెలిపారు. 55శాతం హర్యానా ప్రజలు బీజేపీకి ఓటు వేశారని,అది బీజేపీపై వారికున్న విశ్వాసం,పార్టీకి ప్రజల మద్దుతు ఉందని తెలిపై సైన్ అని మోడీ అన్నారు. ఇది గొప్ప గౌరవం అన్నారు. తాను అడిగినదానికన్నా హర్యానా ప్రజలు ఎక్కువే ఇచ్చారని మోడీ అన్నారు.

సీఎం మనోహర్ లాల్ కట్టర్ చేపట్టిన ‘జన్ ఆశీర్వాద్ యాత్ర’ ముగింపు కార్యక్రమంలో మోడీ పాల్గొని ప్రసంగించారు. రోహ్‌తక్‌లో తాను గత కొన్ని నెలల్లో మూడుసార్లు పర్యటించానని, ఈసారి మీ నుంచి మరింత మద్దతు కోరేందుకు ఇక్కడకు వచ్చానని ప్రజలనుద్దేశించి ప్రధాని అన్నారు. కొత్త ప్రభుత్వపు 100రోజుల పాలనలో దేశ ప్రజలు అనేక పెద్ద మార్పులు చూశారని మోడీ అన్నారు.

ఆర్టికల్ 370  రద్దు చేశామని,కఠినమైన చట్టాలు అమల్లోకి తీసుకొచ్చామన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసమేనని మోడీ సృష్టం చేశారు. అది ట్రిపుల్ తలాఖ్ అయినా లేక జమ్మూకశ్మీర్ విషయంలోనైనా లేక ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడం ఇలా ఏదైనా ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు మోడీ తెలిపారు.

దేశ ప్రజలు సమస్యలకు కొత్త పరిష్కారాల అన్వేషణ ప్రారంభించారని అన్నారు. చంద్రయాన్-2 మిషన్‌ దురదృష్టవశాత్తూ నిర్దేశిత లక్ష్యాన్ని సాధించనప్పటికీ యావద్దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిందన్నారు. చంద్రయాన్ మిషన్ ప్రయోగం తిలకించేందుకు సెప్టెంబర్ 7వ తేదీ తెల్లవారుజామున 1.50 గంటల నుంచి ప్రజలు టీవీలకే అతుక్కుపోయారని, ఒక ఘటన యావద్దేశ ప్రజలను ఎలా మేల్కొలిపిందో ఆ 100 నిమిషాల్లో తాను చూశానని అన్నారు. ‘స్పోర్ట్స్‌మన్ స్పిరిట్’ అనే మాట తరచు వినిపిస్తుంటుందని, హిందుస్థాన్‌లో ఇప్పుడు ‘ఇస్రో స్ఫూర్తి’ అందరిలోనూ కనిపించిందని చెప్పారు.
 
హర్యానాలో అక్టోబర్-నవంబర్‌లలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకుని ప్రజాసేవకు అవకాశం కల్పించాలని కోరుతూ 90 నియోజకవర్గాల్లో సీఎం కట్టర్ ఆగస్ట్-18న జన్ ఆశీర్వాద్ యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.