×
Ad

CM Uddhav Thackeray : 15 రోజులు కర్ఫ్యూ, 144 సెక్షన్..భోజనం ఫ్రీ, పేదలకు, ఆదివాసీలకు రూ. 2వేల ఆర్థిక సాయం

కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండటంతో మహారాష్ట్ర సర్కార్ ప్రకటించిన సెమీ లాక్‌డౌన్‌ 2021, ఏప్రిల్ 14వ తేదీ బుధవారం నుంచి అమల్లోకి రానుంది.

  • Published On : April 14, 2021 / 02:04 PM IST

Maharashtra

Curfew For 15 Days : కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండటంతో మహారాష్ట్ర సర్కార్ ప్రకటించిన సెమీ లాక్‌డౌన్‌ 2021, ఏప్రిల్ 14వ తేదీ బుధవారం నుంచి అమల్లోకి రానుంది. దాదాపు లాక్‌డౌన్‌ తరహాలో 15 రోజుల పాటు కర్ఫ్యూ, 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు. కొత్త ఆంక్షలు బుధవారం రాత్రి 8గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. నిత్యావసరాలు, అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. కరోనాతో మరోసారి యుద్ధం మొదలైందని.. అయితే లాక్‌డౌన్‌ కాకుండా బ్రేక్‌ ది చైన్‌ పేరుతో ఆంక్షలను అమలు చేస్తున్నట్టు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే వెల్లడించారు. కరోనా విలయ తాండవం చేస్తోందన్న ఠాక్రే.. ప్రజల ప్రాణాలకంటే ఏదీ ముఖ్యంకాదన్నారు. అందుకే మరోసారి కఠిన ఆంక్షల అమలుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

కరోనా వ్యాప్తి చైన్‌ను తెంచేందుకు మే ఒకటి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటికి రాకూడదు. మినహాయింపు ఉన్నవి తప్ప అన్నిరకాల ఆఫీసులు, వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసేయాలి. జనం గుమిగూడే అన్నిరకాల ఫంక్షన్లు, కార్యక్రమాలపై నిషేధం ఉంటుంది. ప్రజారవాణా, లోకల్‌ రైలు సేవలు కొనసాగుతాయి.. కానీ అవి అత్యవసర సేవలు అందించే వారికి మాత్రమే. రాత్రి కర్ఫ్యూ పూర్తిస్థాయిలో ఉంటుంది. పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అత్యవసర సేవల కోసం మాత్రం బయటికి రావాలి. పెట్రోలు బంకులు, బ్యాంకింగ్‌ సంస్థలు యథావిధిగా పనిచేస్తాయి.

బ్రేక్‌ ది చైన్‌ ఆంక్షలతో ఇబ్బంది పడే పేదలను ఆదుకునేందుకు 5 వేల 476 కోట్లతో ప్యాకేజీని సీఎం ఠాక్రే ప్రకటించారు. పేదలు తిండి కోసం ఇబ్బందిపడకుండా ఉండేందుకు.. 10 రూపాయలకు అందించే శివ భోజన్‌ను ఉచితంగా పంపిణీ చేస్తారు. రేషన్‌ లబ్ధిదారులకు మూడు కిలోల చొప్పున గోధుమలు, రెండు కిలోల చొప్పున బియ్యం ఉచితంగా ఇస్తారు. వివిధ పథకాల కింద వికలాంగులు, సీనియర్‌ సిటిజన్లు, విడోలకు అందే పెన్షన్లకు సంబంధించి రెండు నెలల సొమ్మును అడ్వాన్స్‌గా ఇవ్వనున్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేసే రిజిస్టర్డ్‌ కార్మికులకు, లైసెన్సుడ్‌ ఆటో డ్రైవర్లకు 1,500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. పలు పథకాల కింద లబ్ధిపొందే పేదలకు, ఆదివాసీలకు 2 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు.

Read More : Oxygen Beds Full : కరోనా కల్లోలం, గుట్టలు గుట్టలుగా శవాలు..ఆక్సిజన్ బెడ్స్ ఫుల్