Udhayanidhi Stalin
Udhayanidhi Stalin:తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ తనయుడు చేపాక్- ట్రిప్లికేన్ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మంత్రివర్గంలో చేరనున్నారు. ఈ మేరకు రంగం సిద్ధమైంది. మండలిలో, మంత్రిగా ఉదయనిధి స్టాలిన్‌ను చేర్చుకోవాలన్న సీఎం సిఫారసుకు తమిళనాడు గవర్నర్ ఆమోదం తెలిపారు. డిసెంబర్ 14న రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయన కుమారుడు ఉయనిధి స్టాలిన్ కు యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి మంత్రిత్వ శాఖను కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయనిధి తొలిసారి ఎమ్మెల్యే అయ్యి పార్టీలో యువజన విభాగం కార్యదర్శిగా ఉన్నారు. ఇదిలాఉంటే ఉదయనిధికి సచివాలయంలో ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేసే పనులు చురుగ్గా సాగుతున్నాయి. సచివాలయ భవన సముదాయంలో వేర్వేరు ఛాంబర్లున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పదవిని చేపట్టనున్న ఉదయనిధి కోసం సచివాలయం పదో నెంబర్ ప్రవేశద్వారం సమీపంలో ఛాంబర్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Tamil Nadu : సీఎం సింప్లిసిటీ.. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తికి మాస్క్ తొడిగిన స్టాలిన్
గత కొద్దినెలలుగా సీనియర్ మంత్రులు, పలువురు పార్టీ నేతలు ఉదయనిధిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం స్టాలిన్ పై ఒత్తిడి తెస్తున్నట్లు తమిళరాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీల్లోని పలువురు నేతలు వారసత్వ రాజకీయంపై స్టాలిన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. తొలుత స్టాలిన్ తన కుమారుడికి మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు నిరాకరించినప్పటికీ.. పార్టీ నేతల ఒత్తిడి మేరకు మంత్రి వర్గంలో చేర్చుకొనేందుకు ఒప్పుకున్నట్లు తెలిసింది. దీంతో ఉదయనిధి స్టాలిన్ 14న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం.